Vizag News: విశాఖపట్నం తీరం మిలాన్‌ 2022 (MILAN 2022) మెరుపులతో అంగరంగ వైభవంగా దర్శనమిస్తోంది. ఓ పక్క సముద్రం అంతా నౌకలతో నిండి ఉండగా, రోడ్లన్నీ రంగుల మయంగా దర్శనమిస్తున్నాయి. అయితే ఈ నెల  25 నుంచి మిలాన్‌ విన్యాసాలు ప్రారంభమైనట్లు నావికాదళం ప్రకటించింది. 27న జరుగనున్న ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌కు (Milan-2022 International City Parade) నమూనా విన్యాసాలను శనివారం సాయంత్రం ఆర్‌కె బీచ్‌లో (RK Beach) నిర్వహించారు.


ఆపరేషనల్‌ పరేడ్‌ డెమాన్‌స్ట్రేషన్‌గా పిలిచే ఈ విన్యాసాల్లో యుద్ధ నౌకలు, సీ హార్స్‌, యుద్ధవిమానాలు, ఫ్లై పాక్స్‌, నీటిలో నీలి రంగు బాంబర్లు, పారాచూట్లపై ఆకాశంలోకి ఎగరడం, నౌకలో ప్రమాదం జరిగితే అక్కడ ఉన్నవారిని పారా చూట్‌లోకి దిగి రక్షించడం వంటి విన్యాసాలు అత్యంత ఘనంగా జరిగాయి. యుద్ధం జరుగుతున్న సమయంలో నౌక ప్రమాదానికి గురైన వేళలో గగనతలంలో ఎగిరే యుద్ధవిమానాల నుంచి నిచ్చెన మెట్లపై ఓడలోకి కమాండోలు దిగి అందులో వారిని రక్షించే విన్యాసాలు అందరినీ అబ్బురపరిచాయి. సీ హార్స్‌, ఫ్లై పాక్స్‌ గగనతంలో చేసిన సందడికి ఆకాశమే హద్దుగా జరిగింది. కమాండోలు తుపాకులతో తీరం ఒడ్డున చేసిన యుద్ధవిన్యాసాలు, మెరైన్‌ కమాండోలు సముద్రంలో ఓడలపై నీటిబాంబర్లతో శతృ నౌకలపై విసురుతూ వారిని మట్టుపెట్టే దృశ్యాలు అలరించాయి.


ఆకాశంలోకి ఒకేసారి 10 యుద్ధవిమానాలు నిప్పులు చెరుగుకుంటూ, కాంతులూ వెదజల్లుతూ వెళ్లే దృశ్యాలు చూపరులను గగుర్పాటుకు గురిచేశాయి. వీటిని నేవీ అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు సహా సాధారణ జనం ఈ దృశ్యాలను తిలకించారు. నేవీ స్కూల్‌ చిల్డ్రన్స్‌, సిటీ పోలీసులు, నావికాదళానికి చెందిన సైలర్లు, ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌కు చెందిన వారు యూనిఫాంలు ధరించి బీచ్‌ రోడ్డులో ఈ పరేడ్‌ చేపట్టారు. అనంతరం లేజర్‌ పాయింట్‌ విన్యాసాలు ఆర్‌కెబీచ్‌లో అందరినీ ఆకట్టుకున్నాయి. 


లాంఛనంగా ప్రారంభోత్సవ వేడుక


కేంద్ర సహాయమంత్రి అజయ్ భట్ చేతులు మీదుగా విలేజీ-2022ను అధికారికంగా ‌నిర్వహించారు. సముద్రిక ఆడిటోరియంలో శనివారం సాయంత్రం ఈ కార్యక్రమం చేపట్టారు. వీటితో పాటు దేశీయ కళలు, సంస్కృతి, సంప్రదాయాలు, ఆటబొమ్మలతో కూడిన గ్యాలరీని విశ్వప్రియ ఫంక్షన్‌ హాలు ఆవరణలో ఏర్పాటు చేశారు.


సిటీ పరేడ్ కు ముఖ్య అతిథిగా సీఎం జగన్ (CM Jagan)
మిలన్ లో అతి ముఖ్యమైన సిటీ పరేడ్‌ ఆదివారం  ఆర్‌కె బీచ్‌లో (RK Beach) జరగనుంది. దీనికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో  దేశ, విదేశాలకు చెందిన నౌకలు, యుద్ధ విమానాలు, సబ్‌మెరైన్‌లు విన్యాసాలు చేయనున్నాయి.  అయితే శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాధారణ జనాలను ఆదివారం సాయంత్రం వరకూ బీచ్‌లోకి రాకుండా ఆంక్షలు పెట్టడం గమనార్హం.


రెండు దశల్లో జరుగనున్న మిలన్ (MILAN 2022)


మిలన్ కార్యక్రమం రెండు దశల్లో జరగనుంది. ఈ నెల 28 వరకూ ఆర్ కే బీచ్ లో డ్రిల్స్, మార్చ్ ఫాస్ట్, పరేడ్ లాంటి ఆఫ్ షోర్ నేవీ కార్యక్రమాలు జరుగుతాయి. మార్చ్ 1 నుండి 4 వరకూ రెండో దశలో సముద్రంలో వివిధ దేశాల నౌకాదళాలు సంయుక్తంగా యుద్ధ నౌకలతో రక్షణ విన్యాసాలు జరుగుతాయి. దీనిలో 40కి పైగా దేశాలు తమ తమ నేవీలతో పాల్గొంటున్నాయి.


విశాఖలో తొలిసారి
వివిధ దేశాల మధ్య సుహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పేందుకు ఏర్పాటు చేసిన మిలన్ కార్యక్రమం జరగడం ఇది 11వ సారి కాగా విశాఖ తీరంలో జరగడం మాత్రం తొలిసారి. అందుకే వీలైనంత ఘనంగా చేయడానికి ఏపీ ప్రభుత్వం తనవంతు సహకారాన్ని అందించింది. నిజానికి ఇది రెండేళ్ల క్రితమే 2020 లో జరగాల్సి ఉండగా కోవిడ్ కారణంగా ఆలస్యం అయింది. ఇంతకు ముందు కేవలం 17 దేశాలు మాత్రమే పాల్గొనగా ఈ సారి ఆ సంఖ్య 40 కి చేరింది . అమెరికా,శ్రీలంక, వియత్నాం, ఫ్రాన్స్, బంగ్లాదేశ్, ఇండోనేసియా, మయన్మార్, సౌత్ కొరియా లాంటి దేశాల నేవీ ఫ్లీట్ లు విశాఖ తీరంలో మార్చి 4 వరకూ యుద్ధ విన్యాసాల ప్రదర్శన చేయనున్నాయి.