Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తలపెట్టిన పీపుల్స్ మార్చ్ (People March) (ఫిబ్రవరి 27) నేడు ప్రారంభం అయింది. ప్రజా సమస్యలపై గళమెత్తే ఉద్దేశంతో ఆయన ఈ పాదయాత్రను ప్రారంభించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ముదిగొండ మండలం యడవల్లిలో ఈ యాత్ర ప్రారంభమైంది. ఇవాళ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి మల్లు భట్టి విక్రమార్క యడవల్లి శ్రీలక్ష్మీ నరసింహాస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన పాదయాత్రను ప్రారంభించారు.
మధిర (Madhira) నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఖమ్మం (Khammam) జిల్లా నాయకులు ఈ సందర్భంగా భట్టి విక్రమార్కకి ఘనంగా స్వాగతం పలికారు. భట్టి పాదయాత్ర ప్రారంభించిన యడవల్లికి జనంగా భారీగా వచ్చారు. గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు. మహిళలు మంగళ హారతులు పట్టి తిలకం దిద్దారు. ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యువకులు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. డప్పు వాయిద్యాలు, కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలతో యడవల్లి హోరెత్తింది. ఈ సందర్భంగా కార్యకర్తలు దారి పొడవునా భట్టి విక్రమార్కపై పూలవర్షం కురిపించారు.
పాదయాత్ర ప్రారంభం సందర్భంగా భట్టి విక్రమార్క ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వం మెడలు వంచేందుకే ఈ పాద యాత్ర అని అన్నారు. తెలంగాణ తెచ్చుకున్నది సమస్యలు పోవాలని, అందరికి ఇళ్లు, ఉద్యోగాలు వస్తాయని అన్నారు. కానీ, అది నెరవేరలేదని అన్నారు. సంపద మొత్తం కొద్ది మంది పాలకుల ఇళ్లలోకే వెళ్తోందని, పేదలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక ఒక్కసారి కూడా డీఎస్సీ వేయలేదని అన్నారు. ఏళ్లుగా నిరుద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కేంద్రంపై పోరాటం చేయాల్సిందేనని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.
ప్రతి రోజూ 15 నుండి 20 కిలో మీటర్ల దూరం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) పాదయాత్ర కొనసాగించనున్నారు. గత ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ఇచ్చిన హమీలను అమలు చేయాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేస్తున్నారు. మధిర నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తైన తర్వాత ఖమ్మం జిల్లాలో కూడా యాత్ర చేయాలని భట్టి విక్రమార్క ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ఎర్రుపాలెం అమలాపురం శ్రీ వెంకటేశ్వర ఆలయంలో పూజుల ముగించిన తర్వాత పాదయాత్రను ముగించనున్నారు.
సోనియా గాంధీ (Sonia Gandhi) నాయకత్వంలో తెలంగాణ తెచ్చుకుంటే కేసీఆర్, ఆయన కుటుంబం, అనుచరులు బాగుపడడానికి ఉపయోగపడిందని సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల గురించి అడిగితే పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ అంటే నలుగురు కుటుంబ సభ్యులు కాదని, నలుగురు మంత్రులు కాదని అన్నారు. పీపుల్స్ మార్చ్‌తో ప్రగతి భవన్‌ను బద్దలు కొడతామని మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.