ఉక్రెయిన్​పై రష్యా నాలుగో రోజు కూడా భీకర దాడులతో విరుచుకుపడుతోంది. రాజధాని నగరం కీవ్​లోకి ప్రవేశించేందుకు రష్యా సేనలు ప్రయత్నిస్తున్నాయి. కీవ్​లోకి ప్రవేశించకుండా రష్యా బలగాలను ఉక్రెయిన్ సైన్యం తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. 





 

దక్షిణ, ఆగ్నేయ ఉక్రెయిన్‌లోని రెండు పెద్ద నగరాలను తమ అధీనంలోకి తీసుకున్నట్లు రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్‌లోని రెండో నగరంలోకి రష్యా సేనలు ప్రవేశించాయి.  ఉక్రెయిన్​లోని గ్యాస్​, చమురు నిక్షేపాలపై దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో పలు నగరాల్లో భారీ పేలుళ్ల మోత మోగుతోంది.








 

గ్యాస్ పైప్‌లైన్

 

కార్కివ్​ నగరంలోని గ్యాస్​పైప్​లైన్​ను రష్యా సైనికులు పేల్చేశారు. గ్యాస్​పైప్​లైన్​ పేలినప్పుడు దట్టమైన పొగ ఏర్పడిందని కార్కివ్​లోని స్పెషల్ కమ్యూనికేషన్​ అండ్ ఇన్ఫర్మేషన్​​ ప్రొటక్షన్ విభాగం తెలిపింది. ఉక్రెయిన్‌లో రష్యా సృష్టిస్తోన్న విధ్వంసం వల్ల పర్యావరణంతో పాటు ప్రజల ప్రాణాలకు కూడా హాని కలుగుతోందని తెలిపింది.

 

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిరి పుతిన్ వెంటనే తన బలగాలను వెనక్కి తీసుకోవాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. మరోవైపు ఎన్ని దాడులు చేసినా తమ దేశాన్ని ఆక్రమించుకోనివ్వమని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్‌స్కీ తేల్చిచెప్పారు. తన ప్రాణాలు పోయినా సరే రాజధానిని వీడనని, తుది వరకు పోరాడతామన్నారు.

 

ప్రపంచ దేశాలు న్యాయం వైపు నిలబడాలని, ఉక్రెయిన్‌కు సాయం చేయాలని ఆయన కోరారు. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాలని ఐరోపా కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు.