ఓ సంచలన నిర్ణయంతో ఇస్లామిక్ దేశమైన ఇరాన్ ప్రపంచాన్ని మరోసారి షాక్‌కు గురిచేసింది. ఇరాన్‌కు చెందిన అమీర్ నసర్ -అజాదాని అనే 26 ఏళ్ల ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆటగాడికి మరణ శిక్ష విధించింది. మహిళా హక్కుల కోసం జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నాడన్న కారణంగా అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
సెప్టెంబర్ నెలలో 22 ఏళ్ల మహ్స అమిని అనే ఇరాన్ మహిళా పొలీసు కస్టడీలో అనుమానాస్పదంగా మరణించింది. దీంతో దేశంలో మహిళలకు మద్దతుగా, మహ్స అమిని మరణానికి ప్రభుత్వం, పోలీసులు కారణం అంటూ.. మహిళా హక్కుల కోసం ఈ ఆందోళనలు చెలరేగాయి. వాస్తవానికి ఏం జరిగిందంటే.. హిజాబ్ సరిగ్గా ధరించలేదు అన్న కారణంతో ప్రభుత్వానికి చెందినా మోరల్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి కస్టడీ లోకి తీసుకున్నారు. ఆ తర్వాత మహ్స అమిని అనుమానాస్పదంగా చనిపోవడంతో దేశ వ్యాప్తంగా మహిళల హక్కులు, ప్రాధమిక స్వేఛ్చ మొదలైన అంశాలపై ఆందోళనలు చెలరేగాయి. ఇది పలు చోట్ల ఉద్రిక్తతలకు దారి తీసింది.
ఈ క్రమంలో ఇరాన్ లో నవంబర్ 17 న జరిగిన ఆందోళనల్లో ఇద్దరు సైనికులు, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ క్రోప్స్ కి చెందినా ఓ వ్యక్తి చనిపోయారు. ఈ ఘటనకు తనే కారణం అని అమీర్ ఒప్పుకోవడంతో అతనికి ప్రభుత్వం మరణ శిక్ష విధించాలని నిర్ణయించింది. `నవంబర్ 20 న అమీర్ టీవీ లో కనిపించి ఆ హత్యలకు కారణం అతనే అని ఒప్పుకున్నాడు. దేశానికి చెందిన మీడియా సంస్థ ప్రకారం అమీర్ కొద్దిసేపు మాత్రమే ఆందోళనలో పాల్గొన్నాడని, ఆ మరణాలు సంభవించి నప్పుడు అతను అక్కడ లేడు అని తెలిపింది.
అమీర్ నసర్ -అజాదాని ప్రొఫెసనల్ ఫుట్‌బాల్ ప్లేయర్. అతడు అమీర్ సేపహన్ కు ఆడటంతో తన కెరీర్ ప్రారంభించాడు. 2015 లో రహ్-అహాన్ కు ఆడిన తర్వాత ట్రాక్టర్, గోల్-ఈ-రాయ్హన్ కు ప్రాతినిథ్యం వహించాడు. గాయం కారణంగా గత కొంతకాలం నుంచి అతను ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఆడటం లేదు.
ఫిఫ్ప్రో అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా 65000 మంది ఆటగాళ్లకు ప్రాతినిథ్యం వహిస్తుంది. డిసెంబర్ 12 రాత్రి ట్విట్టర్ వేదికగా- ఇరాన్ ఫుట్ బాల్ ప్లేయర్ కు విధించిన మరణశిక్ష నిర్ణయాన్ని ఈ విషయాన్ని షేర్ చేసింది. మహిళల హక్కుల కోసం జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నాడని అమీర్ కు మరణ శిక్ష విధించడం దారుణమని, మేము అతనికి అండగా నిలబడి శిక్షను రద్దు చెయ్యాలని పోరాడుతాం అని తెలిపింది.
కొన్ని రోజుల కిందట ఉరిశిక్ష..
హిజాబ్ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్న ఓ వ్యక్తికి ఇరాన్ ప్రభుత్వం ఇటీవల మరణశిక్ష అమలు చేసింది. ఈ ఏడాది సెప్టెంబరు 25న ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోని ఓ రోడ్డును బ్లాక్ చేసి ఆందోళన చేపట్టారు. ఇందులో పారామిలిటరీ సిబ్బందిలో ఒకరిని గాయపరిచినట్టు మొహసెన్ షెకారీ అనే వ్యక్తిపై అభియోగాలు నమోదుచేశారు. కోర్టు అతడిని దోషిగా తేల్చడంతో పాటు నవంబరు 1న మరణశిక్ష విధించింది.