Ukraine War Impact:  ఫిఫా ప్రపంచకప్ నవంబర్ 20న ఖతార్ లో ప్రారంభం కానుంది. దీనికోసం ఇప్పటికే దాదాపు అన్ని జట్లు అక్కడకు చేరుకున్నాయి. అయితే ఈ సారి ఈ మెగా టోర్నీలో ప్రముఖ ఫుట్ బాల్ జట్టు రష్యా కనిపించదు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఫిఫా రష్యాను టోర్నీలో పాల్గొనకుండా నిషేధించింది. 


ఫిఫా నిషేధం


ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం చేస్తున్న కారణంగా రష్యా ప్రపంచకప్ ఆడకుండా ఫిఫా నిషేధించింది. దీనిపై కొంతకాలం క్రితం ఒక ప్రకటన చేసింది. రష్యా చేస్తున్న యుద్ధం కారణంగా నష్టపోయిన ఉక్రెయిన్ కు మేము సంఘీభావంగా ఉన్నాము. ఉక్రెయిన్ లో పరిస్థితి త్వరలోనే మెరుగుపడుతుంది. ఫుట్ బాల్ మరోసారి ప్రజల్లో శాంతిని, సంఘీభావాన్ని పెంపొందిస్తుందని ఆశిస్తున్నాము అని ఫిఫా ఆ ప్రకటనలో తెలిపింది. 


ఫిఫాతో పాటు యూరోపియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ (UEFA) కూడా రష్యాపై నిషేధం విధించింది. రష్యా ఫుట్‌బాల్ క్లబ్‌లు ప్రపంచవ్యాప్తంగా ఏ టోర్నమెంట్ ఇంకా ఏ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనకుండా నిషేధానికి గురయ్యాయి. అలాగే రష్యన్ క్లబ్ స్పోర్ట్స్ మాస్కోను కూడా యూరోపియన్ లీగ్ నుంచి మినహాయించారు. 


ఫిఫా ప్రపంచకప్ లో పాల్గొనే జట్లు



  • గ్రూప్ ఏ: ఖతార్, ఈక్వెడార్, సెనెగల్, నెదర్లాండ్స్

  • గ్రూప్ బీ: ఇంగ్లండ్, ఇరాన్, యూఎస్ ఏ, వేల్స్

  • గ్రూప్ సి: అర్జెంటీనా, సౌదీ అరేబియా, మెక్సికో, పోలాండ్

  • గ్రూప్ డి: ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, డెన్మార్క్, ట్యునీషియా

  • గ్రూప్ ఈ: స్పెయిన్, కోస్టారికా, జర్మనీ, జపాన్

  • గ్రూప్ ఎఫ్: బెల్జియం, కెనడా, మొరాకో, క్రొయేషియా

  • గ్రూప్ జీ: బ్రెజిల్, సెర్బియా, స్విట్జర్లాండ్, కామెరూన్

  • గ్రూప్ హెచ్: పోర్చుగల్, ఘనా, ఉరుగ్వే, రిపబ్లిక్ ఆఫ్ కొరియా

  • లైవ్ టెలికాస్ట్ 


భారతదేశంలో జరిగే ఫిఫా ప్రపంచ కప్ 2022 ప్రసార హక్కులను వయోకామ్ 18 దక్కించుకుంది. స్పోర్ట్స్-18 మరియు స్పోర్ట్స్-18 హెచ్ డీ ఛానెల్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. వూట్ సెలెక్ట్, జియో టీవీలోనూ చూడవచ్చు.


ప్రపంచ కప్ - 2022 మ్యాచ్ షెడ్యూల్


గ్రూప్ దశ నవంబర్ 20 నుంచి డిసెంబర్ 2 వరకు జరుగుతుంది. నాకౌట్ మ్యాచులు డిసెంబర్ 3-6 వరకు రౌండ్ ఆఫ్ 16తో ప్రారంభమవుతాయి. డిసెంబర్ 9, 10 తేదీల్లో క్వార్టర్ ఫైనల్స్, డిసెంబర్ 13, 14 తేదీల్లో సెమీ ఫైనల్స్ జరుగుతాయి. మూడో స్థానం కోసం పోటీ ఫైనల్‌కు ఒక రోజు ముందు డిసెంబర్ 17న జరుగుతుంది. 


ప్రపంచ కప్- 2022 జరిగే మైదానాలు


టోర్నమెంట్‌లోని 64 మ్యాచ్‌లు 8 వేదికల్లో జరుగుతాయి. అల్ బైట్ స్టేడియం, ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియం, అల్ తుమామా మైదానం, అహ్మద్ బిన్ అలీ స్టేడియం, లుసైల్ స్టేడియం, స్టేడియం 974, ఎడ్యుకేషన్ సిటీ మైదానం, అల్ జనోబ్ స్టేడియం లలో ఫిఫా ప్రపంచకప్ జరగనుంది.