Wayne Rooney On Ronaldo: ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డొపై మాంచెస్టర్ యునైటెడ్ దిగ్గజం వేన్ రూనీ విమర్శలు వర్షం కురిపించాడు. అతడు తల దించుకొని పని చేస్తే మంచిదన్నాడు. జట్టులో అతడి ప్రవర్తన ప్రశ్నార్థకంగా కనిపిస్తోందని వెల్లడించాడు. మేనేజర్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఆడితే మంచిందన్నాడు. ప్రీమియర్ లీగ్ తాజా సీజన్లో మాంచెస్టర్ యునైటెడ్ ప్రదర్శన బాగా లేదు. ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతుండటంతో ఇలా అన్నాడు.
'క్రిస్టియానో తల వంచుకొని పనిచేయాలి. మేనేజర్‌కు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆడేందుకు సిద్ధంగా ఉండాలి. అతడలా ఉంటేనే జట్టుకు ఆస్తిగా మారతాడు. అలా లేకుంటే అనవసర అంతరాయాలకు కారణమవుతాడు' అని రూనీ అన్నాడు. మాంచెస్టర్ యునైటెడ్‌లో అతడి ప్రవర్తన అంగీకారయోగ్యంగా లేదన్నాడు. అతడికి కెప్టెన్ రాయ్ కీన్ అండగా నిలవడాన్ని తప్పు పట్టాడు.
'అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో రొనాల్డో, మెస్సీ ఆల్‌టైమ్ గ్రేట్ ఆటగాళ్లు. అలాంటప్పుడు మీరు నిర్ణయించిన దారిలో నడవొచ్చు. అయితే సీజన్ ఆరంభం నుంచి జరుగుతున్న పరిణామాలు మాంచెస్టర్‌కు ఆమోదయోగ్యం కాదు' అని రూనీ పేర్కొన్నాడు. 'రొనాల్డొకు రాయ్‌కీన్ మద్దతుగా నిలవడం గమనించాను. రాయ్ దానిని అంగీకరించొద్దు. జట్టును పునర్ నిర్మిస్తున్న సమయంలో అతడిలా చేయడం సరికాదు' అని వెల్లడించాడు.
మాంచెస్టర్ యునైటెడ్‌కు ఎరిక్ టెన్ హగ్ సరైనోడని రూనీ అభిప్రాయపడ్డాడు. 'టెన్ హగ్ బాగా ఆడుతున్నాడు. జట్టుపై బలమైన ముద్ర వేస్తున్నాడు. మాంచెస్టర్లో గత రెండు మూడేళ్లుగా గమనిస్తే అతడిని తొలిసారి ఇలా చూస్తున్నాను. జట్టును సరైన దిశలో తీసుకెళ్లేందుకు ఇదే మంచి సమయం' అని రూనీ పేర్కొన్నాడు.