ఆదివారం లీగ్ 1లో పారిస్ సెయింట్ జర్మైన్ (PSG), లోరియెంట్ మధ్య జరిగిన మ్యాచ్‌లో లియోనెల్ మెస్సీ ఆడలేదు. కాలి కండరాల వాపు కారణంగా అతను ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఫిఫా ప్రపంచ కప్ 2022 (FIFA WC 2022) ప్రారంభానికి కేవలం రెండు వారాల ముందు ఈ గాయం కావడం అర్జెంటీనాలో భయాన్ని పెంచుతుంది.
నిజానికి అర్జెంటీనాకు చెందిన ఇద్దరు స్టార్ ప్లేయర్లు ఇప్పటికే గాయపడ్డారు. ఏంజెల్ డి మారియా, పాలో డిబెల్లా ఈసారి ప్రపంచకప్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో అర్జెంటీనా అతిపెద్ద ఆటగాడు లియోనెల్ మెస్సీ గాయపడటం అర్జెంటీనాకు పెద్ద దెబ్బ అనే చెప్పాలి.
అయితే పీఎస్‌జీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం మెస్సీ గాయం తీవ్రమైనది కాదు. ప్రపంచ కప్‌కు ముందు జట్టు చివరి లీగ్ మ్యాచ్‌లో అతన్ని చూడవచ్చు. నవంబర్ 13వ తేదీన ఆక్సెరే ఫుట్‌బాల్ క్లబ్‌తో ఈ మ్యాచ్ జరగనుంది. ముందుజాగ్రత్త చర్యగా లియోనెల్ మెస్సీకి చికిత్స కొనసాగుతుందని, త్వరలో ప్రాక్టీస్ ప్రారంభించనున్నామని పీఎస్‌జీ ప్రకటించింది.
మెస్సీ చివరి ప్రపంచకప్ ఇదే(?)
మెస్సీకి ఇది ఐదో ప్రపంచకప్. అతని కెరీర్‌లో ఇదే చివరి ప్రపంచకప్ అయ్యే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో ఈ ఫుట్‌బాల్ దిగ్గజం తన జట్టును ప్రపంచ ఛాంపియన్‌గా మార్చే చివరి అవకాశం ఇదే కావచ్చు. ప్రస్తుతం మెస్సీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతను ఈ సీజన్‌లో ఇప్పటివరకు 12 గోల్స్, 14 అసిస్ట్‌లు చేశాడు. అర్జెంటీనా తన ప్రపంచ కప్ పోరాటాన్ని నవంబర్ 22వ తేదీ నుంచి ప్రారంభించనుంది. సౌదీ అరేబియాతో జరిగే తొలి మ్యాచ్ ద్వారా రంగంలోకి దిగనుంది.