Danushka Gunathilaka Arrested: శ్రీలంక ఓపెనర్ దనుష్క గుణతిలకను సిడ్నీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై అత్యాచారం ఆరోపణలు రావటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతను సిడ్నీలో ఉన్నాడు. మిగతా శ్రీలంక జట్టు టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన తర్వాత కొలంబోకు బయలుదేరింది.
దనుష్కపై 29 ఏళ్ల యువతి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. తన నివాసంలో అతను లైంగికంగా వేధించాడని ఆ మహిళ చెప్పింది. ఈ ఘటన ఈ వారం ప్రారంభంలో జరిగినట్లు సమాచారం.
న్యూ సౌత్ వేల్స్ పోలీసులు దీనిపై ఒక ప్రకటన విడుదల చేశారు, 'ఇద్దరు ఆన్‌లైన్ డేటింగ్ యాప్ ద్వారా చాలా రోజుల సంభాషణ తర్వాత కలుసుకున్నారు. నవంబర్ 2న సాయంత్రం దనుష్క మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీని తరువాత పోలీసులు ముందు రోజు మహిళ నివాసం 'రోజ్ బే'లో క్రైమ్ సీన్ పరీక్ష నిర్వహించారు. విచారణ తర్వాత 31 ఏళ్ల దనుష్క గుణతిలకను సిడ్నీలోని ససెక్స్ స్ట్రీట్‌లోని హోటల్ నుంచి అరెస్టు చేశారు. గుణతిలకను టీమ్ హోటల్ నుంచి నేరుగా సిడ్నీ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని, అక్కడ ఆమె అనుమతి లేకుండా లైంగిక చర్యలో పాల్గొన్నందుకు అతనిపై కేసు నమోదు చేశారని ప్రకటనలో పేర్కొన్నారు.
గాయం కారణంగా మెగా టోర్నీకి దూరం
2022 టీ20 ప్రపంచకప్ శ్రీలంక జట్టులో దనుష్క గుణతిలక సభ్యుడు. ఇక్కడ అతను ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు. నమీబియాతో మ్యాచులో ఆడిన అతను డకౌట్ గా వెనుదిరిగాడు. తర్వాత గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతని స్థానంలో అషిన్ బండారను జట్టులోకి తీసుకున్నారు. అయితే జట్టుకు దూరమైనప్పటికీ అతను ఆస్ట్రేలియాలోనే ఉన్నాడు.
ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ ఇప్పటివరకు శ్రీలంక తరఫున 100కి పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. గుణతిలక నవంబర్ 2015లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అతను 47 వన్డేలు, 46 టీ20 ఇంటర్నేషనల్స్, 8 టెస్ట్ మ్యాచ్‌లలో శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించాడు. వన్డేల్లో రెండు సెంచరీలు చేశాడు.