FIFA WC Saudi Arabia: నిన్న లుసైల్ స్టేడియంలో జరిగిన గ్రూప్ సి పోరులో రెండుసార్లు ఛాంపియన్ అర్జెంటీనాపై సౌదీ అరేబియా సంచలన విజయం సాధించింది. తమ ఫుట్‌బాల్ జట్టు అద్భుతమైన విజయం సాధించిన సందర్భంగా సౌదీలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, విద్యా సంస్థలకు ప్రభుత్వం బుధవారం సెలవు ప్రకటించినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. ఈ మేరకు అక్కడి రాజు సల్మాన్ ఆదేశించినట్లు ఆ దేశ ఆంగ్ల దినపత్రిక తెలిపింది.
ప్రపంచ ర్యాంకింగ్స్ లో 51వ స్థానంలో ఉన్న సౌదీ అరేబియా తన ప్రపంచకప్ ప్రయాణాన్ని సంచలన విజయంతో ప్రారంభించింది. 10వ నిమిషంలో లభించిన పెనాల్టీని లియోనెల్ మెస్సీ గోల్‌గా మలిచి అర్జెంటీనాకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. అయితే రెండో అర్ధ భాగంలో కథ భిన్నంగా మారింది. సౌదీ ఆటగాళ్లు కొత్త ఉత్సాహంతో అర్జెంటీనాపై దాడికి దిగారు. 48వ నిమిషంలో సలేహ్ అల్-షెహ్రీ గోల్ చేయడంతో స్కోరును 1-1తో సమం చేసింది. ఐదు నిమిషాల తర్వాత 53వ నిమిషంలో సేలం అల్-దవ్సారి గోల్ చేయడంతో సౌదీ ఆధిక్యంలోకి వెళ్లింది.
ఆ తర్వాత మరింత జాగ్రత్తగా ఆడిన సౌదీ ఆటగాళ్లు ప్రత్యర్థికి అవకాశం ఇవ్వలేదు. అర్జెంటీనా ఆటగాళ్లు పదేపదే సౌదీ అరేబియా గోల్ పోస్టుపై దాడి చేసినప్పటికీ.. ఆ జట్టు గోల్ కీపర్ మహ్మద్ అల్ ఒవైస్ సమర్ధంగా అడ్డుకున్నాడు. ఒక్క గోల్ కూడా చేయనివ్వలేదు. సౌదీ డిఫెన్స్ కూడా అర్జెంటీనాను అడ్డుకుంది. దీంతో 2-1 తేడాతో సౌదీ అరేబియా విజయం సాధించింది.
ఫేవరెట్ కు షాక్
హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన మెస్సీ సేనను 51వ ర్యాంకర్ అయిన సౌదీ అరేబియా ఓడించడం సాకర్ ప్రపంచానికి షాకే. అర్జెంటినాను సౌదీ అరేబియా ఓడించడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌కు ముందు ఇరు జట్లు నాలుగుసార్లు తలపడ్డాయి. రెండుసార్లు అర్జెంటినా విజయం సాధించగా, రెండు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. లుసాలీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మెస్సీ ఒక గోల్‌తో మెరిసినా ఫలితం లేకుండా పోయింది. 2019 నుంచి ఇప్పటి వరకు వరుసగా 36 మ్యాచ్‌లలో విజయం సాధించిన అర్జెంటినా చివరికి ఓ చిన్న జట్టు చేతిలో ఓటమి పాలైంది.