FIFA WC 2022 Qatar:  ఫిఫా ప్రపంచకప్ లో సంచలనం. పటిష్టమైన అర్జెంటీనా జట్టును సౌదీ అరేబియా ఓడించింది. మెస్సీ నాయకత్వంలోని జట్టును 2-1 తేడాతో సౌదీ కంగుతినిపించింది. దీంతో ఆ జట్టు ఆటగాళ్లతో పాటు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. 


దాదాపు 89 వేలకు పైగా హాజరైన ఫుట్ బాల్ అభిమానుల మధ్య జరిగిన ఈ మ్యాచ్ జరిగింది. సౌదీ అరేబియా గోల్ కీపర్ ఆల్ ఓవైస్ ఈ మ్యాచ్ లో హీరోగా నిలిచాడు. అర్జెంటీనా ఆటగాళ్లు గోల్‌పోస్టు వైపు కొట్టిన బంతులను అద్భుతంగా అడ్డుకొన్నాడు. ఆట ప్రారంభమైన పదో నిమిషంలోనే పెనాల్టీ రూపంలో వచ్చిన అవకాశాన్ని మెస్సి గోల్‌గా మలిచాడు. తొలి అర్ధ భాగంలో అర్జెంటీనా ఆటగాళ్లు పదేపదే గోల్‌పోస్టు వైపు దూసుకెళ్లారు. అయితే సౌదీ గోల్‌కీపర్ సమర్థంగా అడ్డుకొన్నాడు. ఆ తర్వాత రెండో అర్ధభాగంలో సౌదీ అరేబియా దాడి మొదలుపెట్టింది. 48వ నిమిషంలో సలేహ్‌ ఆల్‌ షెహ్రి, 53వ నిమిషంలో సలీమ్‌ ఆల్‌ డాసరి గోల్స్‌ చేసి అర్జెంటీనాను కంగుతినిపించారు. ఆ తర్వాత మరింత జాగ్రత్తగా ఆడిన సౌదీ అరేబియా ప్రత్యర్థి జట్టుకు అవకాశం ఇవ్వలేదు. ప్రత్యర్థి ఆటగాళ్లు పదేపదే గోల్ పోస్టులపై దాడి చేసినా సౌదీ డిఫెన్స్ ఆటగాళ్లు సమర్థంగా అడ్డుకున్నారు. చివరి వరకు ఆధిపత్యాన్ని కాపాడుకుని సంచలన విజయాన్ని నమోదు చేశారు. కాగా, అర్జెంటీనా తన తర్వాతి మ్యాచ్‌లో ఆదివారం మెక్సికోతో తలపడుతుంది.


మ్యాచ్‌ ముగిశాక మెస్సి షాక్‌కు గురై అలాగే కాసేపు ఉండిపోయాడు. దీంతో సౌదీ అరేబియా అభిమానులు ‘‘మెస్సి ఎక్కడ..? మేం అతడిని ఓడించాం’’.. ‘‘మా జట్టు మా కలలను నెరవేర్చింది’’ అంటూ ఆనందంతో సంబరాలు జరుపుకున్నారు. 


హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన మెస్సీ సేనను 51వ ర్యాంకర్ అయిన సౌదీ అరేబియా ఓడించడం సాకర్ ప్రపంచానికి షాకే. అర్జెంటీనాను సౌదీ అరేబియా ఓడించడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌కు ముందు ఇరు జట్లు నాలుగుసార్లు తలపడ్డాయి. రెండుసార్లు అర్జెంటీనా విజయం సాధించగా, రెండు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. లుసాలీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మెస్సీ ఒక గోల్‌తో మెరిసినా ఫలితం లేకుండా పోయింది. 


అజేయానికి అడ్డుకట్ట


దీంతో వరుసగా 36 మ్యాచుల్లో అజేయంగా నిలిచిన అర్జెంటీనా.. ఇటలీ రికార్డును (37) అధిగమించడంలో విఫలమైంది. అయితే 1990 ప్రపంచకప్‌ సందర్భంగా దిగ్గజ ఆటగాడు డీగో మారడోనా సారథ్యంలోని అర్జెంటీనా కూడా తన తొలి మ్యాచ్‌లో కామెరూన్‌ చేతిలో (1-0) ఓటమిపాలైంది. అయితే ఆ సీజన్‌లో అర్జెంటీనా ఫైనల్‌కు దూసుకెళ్లి రన్నరప్‌గా నిలిచింది.