Messi's FIFA Record:  ఫిఫా ప్రపంచకప్ లో అర్జెంటీనా బోణీ కొట్టింది. డూ ఆర్ డై మ్యాచులో విజృంభించింది. మెక్సికోతో జరిగిన మ్యాచులో ఆ జట్టు స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ రికార్డు గోల్ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 


తమ మొదటి మ్యాచులో సౌదీ అరేబియా చేతిలో ఖంగుతిని నాకౌట్ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకున్న అర్జెంటీనా రెండో మ్యాచులో తడాఖా చూపించింది. చిరకాల ప్రత్యర్థి మెక్సికోను 2-0 గోల్స్ తేడాతో చిత్తు చేసి.. నాకౌట్ అవకాశాల్ని సజీవంగా ఉంచుకుంది. గ్రూప్ సిలో భాగంగా శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మెక్సికోతో జరిగిన మ్యాచులో అర్జెంటీనా సత్తా చాటింది.


2-0 తో గెలుపు


మొదటి అర్ధభాగంలో రెండు జట్లు  గోల్  చేయలేకపోయాయి. రెండు జట్ల డిఫెన్స్ బలంగా ఉండటంతో ఆటగాళ్లు గోల్ పోస్ట్ పై దాడులు చేసినా ఫలితం లేకపోయింది. అయితే, రెండో అర్ధభాగంలో అర్జెంటీనా రెచ్చిపోయింది. అటాకింగ్ గేమ్ తో మెక్సికోకు చుక్కలు చూపించింది. ముందు ఆట 64 వ నిమిషంలో లియోనల్ మెస్సీ జట్టుకు అదిరిపోయే గోల్ అందించాడు. ఆ తర్వాత ఆట 87 వ నిమిషంలో ఎంజో ఫెర్నాండేజ్ రెండో గోల్ చేయడంతో అర్జెంటీనా శిబిరంలో సంబరాలు అంబరాన్నంటాయి.






మెస్సీ రికార్డు


లియోనల్ మెస్సీ ఈ గోల్ తో రికార్డు సృష్టించాడు. అతను లెజెండరీ ఫుట్‌బాల్ ఆటగాడు డిగో మారడోనా  రికార్డును సమం చేశాడు. మారడోనా ప్రపంచకప్ లలో మొత్తం 8 గోల్స్ చేశాడు. ఇప్పుడు మెస్సీ ఆ రికార్డును అందుకున్నాడు. ఈ ఏడాది అర్జెంటీనా తరఫున మెస్సీకి ఇది 13వ గోల్.