FIFA World Cup 2022:

  ఫిఫా ప్రపంచకప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ నాకౌట్ చేరింది. శనివారం డెన్మార్క్ తో జరిగిన మ్యాచులో 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. యువ ఆటగాడు ఎంబాపే రెండు గోల్స్ చేశాడు. గ్రూప్- డీలో వరుసగా రెండో మ్యాచ్ గెలుపొందిన ఫ్రాన్స్ ఈ మెగా టోర్నీలో నాకౌట్ చేరిన తొలి జట్టుగా నిలిచింది.


శనివారం ఆసక్తికరంగా సాగిన గ్రూప్‌-డి మ్యాచ్‌లో ఆ జట్టు 2-1తో డెన్మార్క్‌ను ఓడించి నాకౌట్లో (16 జట్ల రౌండ్‌)కి దూసుకెళ్లింది. ఎంబాపె 61వ, 86వ నిమిషాల్లో ఫ్రాన్స్‌కు గోల్స్‌ అందించాడు. డెన్మార్క్‌ తరఫున క్రిస్టెన్సన్‌ (68వ) గోల్‌ సాధించాడు. ఫ్రాన్స్‌ తన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించింది. 


ఎంబాపె డబుల్ గోల్స్


డెన్మార్క్‌తో పోరులో ఫ్రాన్స్‌ ఆధిపత్యం స్పష్టం. ఎటాకింగ్ గేమ్ తో ప్రమాదకరంగా కనిపించిన ఆ జట్టు డెన్మార్క్ రక్షణ శ్రేణిని ఒత్తిడిలోకి నెట్టింది. పదో నిమిషంలో గోల్ అవకాశం సృష్టించుకున్నా... ప్రత్యర్థి డిఫెండర్ ఆండ్రియాస్ కార్నెలియస్ బంతిని దాన్ని పక్కకు నెట్టటంతో గోల్ అవ్వలేదు. అయితే ఒత్తిడి కొనసాగించిన ఫ్రాన్స్ 21వ నిమిషంలో దాదాపు గోల్ కొట్టినంత పనిచేసింది. అయిత గోల్ కీపర్ ష్మీషెల్ దాన్ని అడ్డుకున్నాడు. మిడ్‌ఫీల్డ్‌ నుంచి గ్రీజ్‌మన్‌ ఫ్రీకిక్‌ను డెంబెలెకు అందించాడు. అతడి నుంచి వచ్చిన క్రాస్‌ను రబియోట్‌ తలతో నెట్‌ దిశగా కొట్టాడు. కానీ ష్మీషెల్‌ దాన్ని గొప్పగా తిప్పికొట్టాడు. తన కుడివైపునకు దూకుతూ అతడు బంతిని దూరంగా కొట్టాడు. 37వ నిమిషంలో గిరౌడ్‌ (ఫ్రాన్స్‌) బంతిని తలతో డెన్మార్క్‌ గోల్‌కు దూరంగా కొట్టాడు. 41వ నిమిషంలో ఫ్రాన్స్‌కు గోల్‌ కొట్టేందుకు మరో అద్భుత అవకాశం లభించింది. కానీ ఎంబాపె సమీపం నుంచి ఆడిన షాట్‌ క్రాస్‌బార్‌పై నుంచి వెళ్లింది. డెన్మార్క్‌ కూడా ప్రథమార్ధంలో రెండు ప్రయత్నాలు చేసింది. 






అయితే ఫ్రాన్స్‌ దూకుడుకు రెండో అర్ధభాగంలో డెన్మార్క్‌ తలవంచక తప్పలేదు. దాడులు కొనసాగించిన ఫ్రాన్స్‌.. ఎంబాపె సూపర్‌ గోల్‌తో 61వ నిమిషంలో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఎడమ నుంచి డెన్మార్క్‌ నెట్‌ వైపు దూసుకెళ్లిన ఎంబాపె.. హెర్నాండెజ్‌ దిశగా బంతిని పంపి నెట్‌కు ఇంకా దగ్గరగా వెళ్లాడు. డెన్మార్క్‌ డిఫెండర్లను తప్పిస్తూ హెర్నాండెజ్‌ బంతిని తిరిగి ఎంబాపెకు పంపగా.. అతడు చాలా దగ్గర నుంచి బంతిని నెట్లో తన్నాడు. అయితే  ఫ్రాన్స్‌ సంతోషం ఎంతో సేపు నిలవలేదు. 68వ నిమిషంలో క్రిస్టెన్సన్‌ గోల్‌తో డెన్మార్క్‌ స్కోరు సమం చేసింది. ఎరిక్సన్‌ కార్నర్‌ కిక్‌ను అతడు తలతో కొట్టి అలవోకగా ఫ్రాన్స్‌ గోల్‌కీపర్‌ను లోరిస్‌ను బోల్తా కొట్టించాడు. అయితే లోరిస్‌ 73వ నిమిషంలో గొప్ప సేవ్‌తో డెన్మార్క్‌కు రెండో గోల్‌ దక్కకుండా చేశాడు. లిండ్‌స్టామ్‌ షాట్‌ను అతడు అడ్డుకున్నాడు. రెండు జట్లూ గట్టిగా పోటీపడుతుండడంతో మ్యాచ్‌ డ్రా అవుతుందేమో అనిపించింది. కానీ ఎంబాపె మరో గోల్‌తో డెన్మార్క్‌కు షాకిచ్చాడు. 86వ నిమిషంలో డెన్మార్క్‌ గోల్‌కు అతి సమీపంలోకి గ్రీజ్‌మన్‌ ఇచ్చిన క్రాస్‌ను ఎంబాపె నెట్లోకి కొట్టేశాడు. అంతే ఫ్రాన్స్‌ సంబరాల్లో మునిగిపోయింది.