FIFA World Cup 2026 Qualifier: చిరకాల ప్రత్యర్థులు  బ్రెజిల్(Brazil ), అర్జెంటీనా( Argentina )  మధ్య జరిగిన ఫుట్‌బాల్‌ (Foot ball)మ్యాచ్‌లో మరోసారి హింస చెలరేగింది. మ్యాచ్‌ ఆరంభానికి ముందు.. ఇరు దేశాల అభిమానులు స్టేడియంలో ఘర్షణలకు దిగారు. వీరిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌ చేయడంతో అభిమానుల తలలు పగిలిపోయాయి. ఆట ప్రారంభానికి ముందు ఈ గొడవ కారణంగా మ్యాచ్‌ అరగంట ఆలస్యంగా మొదలైంది. దాడులు, లాఠీఛార్జ్‌లు, ఉద్రిక్తతల మధ్య జరిగిన ఈ కీలక మ్యాచ్‌లో అర్జెంటీనా 1-0 తేడాతో బ్రెజిల్‌పై విజయం సాధించింది. అర్జెంటీనా స్టార్‌ ప్లేయర్‌ నికోలస్‌ ఓటామెండి 63వ నిమిషంలో గెలుపు గోల్‌ కొట్టి విజయాన్ని అందించాడు. ఈ విజయంతో అర్జెంటీనా అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి.






ప్రపంచ ఛాంపియన్ అర్జెంటీనా జట్టు ప్రపంచ కప్ 2026 కోసం దక్షిణ అమెరికా క్వాలిఫైయర్స్ కోసం బ్రెజిల్ పర్యటనలో ఉంది. రియో డి జెనీరోలో  చిరకాల ప్రత్యర్థులు  బ్రెజిల్, అర్జెంటీనా మధ్య క్వాలిఫయర్ మ్యాచ్ జరిగింది. లియోనెల్ మెస్సీ సారథ్యంలో అర్జెంటీనా, బ్రెజిల్ మధ్య జరుగుతున్న తొలి మేజర్ మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మ్యాచ్‌కు ముందే అభిమానులు తమ జట్టే గెలుస్తుందని పందేలు విసురుకున్నారు. ఈ మ్యాచ్ కోసం దాదాపు 78 వేల మంది కెపాసిటీ ఉన్న ప్రసిద్ధ మరకానా స్టేడియం పూర్తిగా నిండిపోయింది. ఆట మొదలవడానికి ముందు ఇరు జట్ల ఆటగాళ్లు మైదానానికి వచ్చి జాతీయ గీతాలు ఆలపించే క్రమంలో స్టేడియంలోని అభిమానుల మధ్య వాగ్వాదం మొదలైంది. అది కాస్తా తీవ్రరూపం దాల్చడంతో రంగప్రవేశం చేసిన పోలీసులు దొరికినోళ్లను దొరికినట్టు చితకబాదారు. బ్రెజిలియన్ పోలీసులు... అర్జెంటీనా అభిమానుల మధ్య భీకర ఘర్షణ జరగ్గా, పోలీసులు, అభిమానులపై తమ ప్రతాపాన్ని చూపారు. 


ఈ క్రమంలో అర్జెంటీనా కెప్టెన్‌ మెస్సీతో పాటు జట్టులోని ఇతర ఆటగాళ్లు అక్కడికి చేరుకొని పోలీసులను వారించారు. మ్యాచ్‌ ముగిశాక మెస్సీ కూడా బ్రెజిల్‌ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. పోలీసులు వీరబాదుడు బాదడంతో ఓ అభిమాని తలకు తీవ్రగాయాలయ్యాయి. చాలా మంది అభిమానులు తప్పించుకోవడానికి ప్రయత్నించగా, కొంతమంది అభిమానులు సీట్లను కూల్చివేసి పోలీసులపైకి విసిరారు. పోలీసుల లాఠీలతో కొంతమంది అభిమానులకు తీవ్ర గాయాలయ్యాయి. ఒక ప్రేక్షకుడి తల కూడా పగిలి రక్తం కారడం ప్రారంభించింది. స్ట్రెచర్‌పై ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ గొడవకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.


ఇక ఫిఫా ప్రపంచకప్‌-2026 క్వాలిఫయర్స్‌లో బ్రెజిల్‌ జట్టుకు తొలి మ్యాచ్‌లోనే చేదు అనుభవం ఎదురైంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అర్జెంటీనా చేతిలో బ్రెజిల్‌ 1-0తో ఓటమిపాలైంది. అర్జెంటీనా తరఫున ఏకైక గోల్‌ను నికోలస్‌ చేశాడు. దీంతో దక్షిణ అమెరికా నుంచి అర్జెంటీనా జట్టు గ్రూప్‌ లీగ్‌లో టాప్‌లో నిలిచింది. ఇతర పోటీల్లో కొలంబియా 1-0తో పరాగ్వేపై విజయం సాధించింది. ఉరుగ్వే 3-0తో బలీవియాపై గెలుపొందింది. ఈక్వెడార్‌ 1-0తేడాతో  విజయం సాధించింది. పెరూ-వెనిజులా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ 1-1గోల్స్‌తో డ్రాగా ముగిసింది.