Lionel Messi Retirement:  ప్రపంచ ఫుట్ బాల్ ప్రేమికులకు, ముఖ్యంగా మెస్సీ అభిమానులకు ఎంతో సంతోషకరమైన వార్త. 2022 ఫిఫా ప్రపంచకప్ తర్వాత అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ రిటైరవుతున్నాడంటూ వార్తలు వచ్చాయి. అయితే అవి ఊహాగానాలే అని తేలిపోయాయి. నేను ఇప్పట్లో రిటైరవ్వను అని స్వయంగా మెస్సీనే చెప్పాడు. ఈ వార్త ఈ స్టార్ ఫ్యాన్స్ కు పండగలాంటిదే. 


ఆల్ టైమ్ గ్రేటెస్ట్


36 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం అర్జెంటీనా ఫుట్ బాల్ జట్టు ప్రపంచకప్ ను అందుకుంది. లియోనెల్ మెస్సీ అంతా తానై జట్టును నడిపించి దేశానికి మూడో ట్రోఫీని అందించాడు. అంతేకాదు తనకు కలగా మిగిలిన ప్రపంచకప్ ను ముద్దాడాడు. ఈ కప్ సాధించటంతో మెస్సీ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఆటగాళ్ల లిస్టులో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ఇప్పుడు ఈ అర్జెంటీనా స్టార్ ఖాతాలో లేని ట్రోఫీ లేదు. అయితే ఇదే తన చివరి ప్రపంచకప్ అని మెస్సీ ఇప్పటికే ప్రకటించాడు. అలాగే ఇక అతను రిటైరవుతాడంటూ వార్తలు హల్ చల్ చేశాయి. దీంతో ఫుట్ బాల్ ప్రేమికులు నిరాశకు గురయ్యారు. ఇక తమ అభిమాన ఆటగాడిని మైదానంలోని చూడలేమని భావించారు. అయితే వాటన్నింటికిీ చెక్ పెడుతూ నేను రిటైరవ్వట్లేదు అని మెస్సీ స్వయంగా చెప్పాడు. 






మరికొంతకాలం ఆడతాను


'నేను జాతీయ జట్టు నుంచి రిటైర్ అవ్వను. ప్రపంచ ఛాంపియన్ గా అర్జెంటీనా జెర్సీ వేసుకుని ఇంకొంతకాలం ఆడాలని అనుకుంటున్నాను.' అని మెస్సీ చెప్పాడు. 'మేం ప్రపంచకప్ గెలవడం ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. ఆ దేవుడు నాకు కప్ ఇవ్వబోతున్నాడని నాకు తెలుసు. ఇది చాలా సంతోషంగా ఉంది. నేను ఎన్నో ఏళ్లుగా ఈ కల కన్నాను. ప్రపంచ కప్ తో నా కెరీర్ ను ముగించాలనుకున్నాను. ఇప్పుడు కప్ అందుకున్నాను. అయితే ప్రపంచ ఛాంపియన్ గా ఇంకొంతకాలం ఆడాలనుకుంటున్నాను' అని మెస్సీ తెలిపాడు. 


దీనిపై అర్జెంటీనా కోచ్ లియోనెల్ స్కలోని కూడా మాట్లాడారు. 'తర్వాతి ప్రపంచకప్ లో మెస్సీకి చోటు దక్కాలి. అతను ఆటను కొనసాగించాలని మేం కోరుకుంటున్నాం. అతను కనుక ఆడితే తన కోసం 10వ నెంబర్ జెర్సీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.' అని స్కలోని అన్నాడు.