Messi Retirement:  తనకు ఇదే చివరి ప్రపంచకప్ అని అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ధ్రువీకరించాడు. ఫిఫా ప్రపంచకప్ 2022 ఫైనల్ మ్యాచ్ ప్రపంచకప్ లో తన చివరి మ్యాచ్ అని మెస్సీ అన్నాడు. మంగళవారం అర్ధరాత్రి జరిగిన మొదటి సెమీ ఫైనల్ మ్యాచులో అర్జెంటీనా, క్రొయేషియాపై 3-0 తేడాతో విజయం సాధించి ఫైనల్ కు చేరుకుంది. ఈ గేమ్ లో మెస్సీ ఒక గోల్ చేశాడు. మొత్తంగా ఈ మెగా టోర్నీలో 5 గోల్స్ సాధించాడు. అర్జెంటీనా తరఫున అత్యధిక గోల్స్ చేసిన వారిలో గాబ్రియెల్ బాటిస్టుటా (10) తర్వాతి స్థానంలో నిలిచాడు.


ఫైనల్ మ్యాచే నా చివరి గేమ్ 


'ఫుట్ బాల్ ప్రపంచకప్ లో నా చివరి గేమ్ ను ఫైనల్ లో ఆడడం సంతోషంగా ఉంది. తర్వాతి ప్రపంచకప్ నకు చాలా సంవత్సరాల సమయం ఉంది. అప్పటివరకు నేను ఆడగలనని అనుకోవడంలేదు. ఇప్పటివరకు సాధించిన విజయాలకు నేను సంతోషంగా ఉన్నాను. నా ప్రపంచకప్ ప్రయాణాన్ని ఇలా ముగించడమే సరైనదిగా భావిస్తున్నాను. ఈసారి కప్ గెలవడానికి మేమ శాయశక్తులా ప్రయత్నిస్తాం' అని మెస్సీ అర్జెంటీనా మీడియా అవుట్ లెట్ డయారియో ఓలేతో అన్నాడు. 






ఎంజాయ్ చేయండి


క్రొయేషియా విజయం సాధించాక మెస్సీ తన సహచరులను ఎంజాయ్ చేయాల్సిందిగా కోరాడు. 'అర్జెంటీనా మరోసారి ప్రపంచకప్ ఫైనల్ కు చేరుకుంది. ఆనందించండి' అని తన సహచరులతో అన్నాడు. 'మేము కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నాము. అలాగే మంచి పరిస్థితుల్లోనూ ఆడాము. ఈరోజు అద్భుతమైన స్థితిలో ఉన్నాం. నా ప్రయాణం ఆనందంగా సాగింది. అయితే జట్టు లక్ష్యాలను సాధించడమే అన్నింటికంటే అద్భుతంగా ఉంటుంది.' అని మ్యాచ్ అనంతరం మెస్సీ పేర్కొన్నాడు. క్రొయేషియాతో మ్యాచులో అర్జెంటీనా ఆటగాడు జూలియన్ అల్వారెజ్ 2 గోల్స్ చేశాడు. 


ఫిఫా ప్రపంచకప్ లో అర్జెంటీనా టోర్నీ ఫేవరెట్ గా బరిలోకి దిగింది. అయితే తన తొలి మ్యాచులోనే సౌదీ అరేబియా చేతిలో 2-1తో ఖంగుతింది. ఈ మ్యాచుకు ముందు వారు 36 మ్యాచుల్లో ఓటమనేది లేకుండా ఉన్నారు. సౌదీ చేతిలో పరాజయంతో అర్జెంటీనా సామర్థ్యంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఆ తర్వాత పుంజుకున్న మెస్సీ జట్టు అద్భుతంగా ఆడి ఫైనల్ కు చేరుకుంది. ఫైనల్ లో మొరాకో లేదా ఫ్రాన్స్ ను అర్జెంటీనా ఢీకొంటుంది.