FIFA WC 2022:  ఫిఫా ప్రపంచకప్ లో అర్జెంటీనా అద్భుతం సృష్టించింది. కెరీర్ లో ఒక్క ప్రపంచకప్ అయినా గెలవాలనే కలకు మరింత దగ్గరయ్యాడు ఆ జట్టు స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ. జట్టును ముందుండి నడిపించి ఫైనల్ చేర్చాడు. మంగళవారం అర్ధరాత్రి జరిగిన సెమీఫైనల్ మ్యాచులో క్రొయేషియాపై అర్జెంటీనా 3-0 తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో సగర్వంగా ఫైనల్ కు చేరుకుంది. 


క్రొయేషియా- అర్జెంటీనా జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచులో తొలి అర్ధగంట ఎలాంటి గోల్ నమోదు కాలేదు. అయితే 34వ నిమిషంలో స్టార్ ఆటగాడు మెస్సీ గోల్ కొట్టి తన జట్టును 1-0 ఆధిక్యంలో నిలిపాడు. పెనాల్టీ కార్నర్ ద్వారా మెస్సీ ఈ గోల్ సాధించాడు. ఈ ప్రపంచకప్ లో మెస్సీకి ఇది ఐదో గోల్. ఫిపా ప్రపంచకప్ చరిత్రలో 11వ గోల్. ఆ తర్వాత వెంటనే అర్జెంటీనాకు మరో గోల్ అవకాశం వచ్చింది. 39వ నిమిషంలో అర్జెంటీనా ఆటగాడు జూలియన్ అల్వారెజ్ గోల్ కొట్టాడు. దీంతో ఆట తొలి అర్ధభాగం ముగిసే సమయానికి ఆ జట్టు 2-0తో తిరుగులోని ఆధిక్యంలో నిలిచింది. 






జూలియన్ అల్వారెజ్ రెండో గోల్


ఇక రెండో అర్ధభాగంలో గోల్ కోసం ఇరు జట్లు పోటాపోటీగా తలపడ్డాయి. కొన్ని గోల్ అవకాశాలు వచ్చినా ఇరు జట్లు సద్వినియోగం చేసుకోలేకపోయాయి. 58వ నిమిషంలో మెస్సీకి గోల్ చేసే అవకాశం వచ్చింది. అయితే అతను గోల్ కొట్టలేకపోయాడు. అయితే 69వ నిమిషంలో మెస్సీ అందించిన బంతిని అందుకున్న జూలియన్ ఎలాంటి పొరపాటు చేయకుండా గోల్ పోస్టులోకి పంపించాడు. దీంతో అర్జెంటీనాకు 3-0 ఆధిక్యం లభించింది. ఇక ఆట ఆఖరివరకు ఇరు జట్లు ఎలాంటి గోల్ చేయలేకపోయాయి. దీంతో మెస్సీ జట్టు విజయం సాధించింది. 






ఫ్రాన్స్- మొరాకో మధ్య నేడు రెండో సెమీస్


అనామక జట్టుగా టోర్నీలో అడుగుపెట్టిన ఆఫ్రికా దేశం మొరాకో సంచలన ప్రదర్శన చేస్తోంది. ఇప్పటి వరకు ఫేవరెట్లు అనుకున్న జట్లను ఓడిస్తూ సెమీస్ వరకు చేరుకుంది. ఫిఫా ప్రపంచకప్ లో సెమీస్ చేరిన తొలి ఆఫ్రికా దేశంగా మొరాకో కొత్త చరిత్రను లిఖించింది. ఇదే దూకుడుతో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ ను కూడా ఓడించి ఫైనల్ చేరాలని పట్టుదలగా ఉంది. మరో వైపు డిఫెండింగ్ చాంపియన్ హోదాతో టోర్నీలో అడుగుపెట్టిన ఫ్రాన్స్ అంచనాలకు తగ్గట్లు ఆడుతుంది. క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్ ను ఓడించి సెమీస్ చేరింది. ఈ రెండు జట్ల మధ్య రెండో సెమీఫైనల్ బుధవారం అర్ధ రాత్రి 12.30 గంటలకు జరగనుంది. ఈ మ్యాచ్ ను స్పోర్ట్స్ 18, జియో సినిమాలు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.