Lionel Messi - Ziva:  లియోనెల్ మెస్సీ.... తాజాగా జరిగిన ఫిఫా ప్రపంచకప్ ను గెలుచుకుని తన జీవితకాల లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు. ఈ మెగా టోర్నీ ఫైనల్ లో ఫ్రాన్స్ పై పెనాల్టీ షూటౌట్ లో విజయం సాధించిన అర్జెంటీనా మూడో కప్పును అందుకుంది. ఆ జట్టు విజయంలో కెప్టెన్ లియోనెల్ మెస్సీ కీలకపాత్ర పోషించాడు. అతను కప్పును ముద్దాడగానే ప్రపంచంలోని ఫుట్ బాల్ అభిమానులందరూ పొంగిపోయారు. 


జివా కోసం జెర్సీ


ఫుట్ బాల్ గ్రేట్ అయిన మెస్సీకి భారత్ లోనూ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇండియాలోనూ మెస్సీకి కోట్ల మంది అభిమానులు ఉన్నారు. అలాగే భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కూడా అతనికి ఫ్యానే. ధోనీకి ఫుట్ బాల్ అంటే చాలా ఇష్టం. తరచుగా తాను సహ యజమానిగా ఉన్న దేశీయ ఫుట్ బాల్ టీం చెన్నైయిన్ ఎఫ్ సీతో కలిసి శిక్షణలో పాల్గొంటుంటాడు. ధోనీ కూతురు జివా సింగ్ ధోనీ, మెస్సీకి వీరాభిమాని. ఈ క్రమంలోనే మెస్సీ, జివాను సర్ ప్రైజ్ చేశాడు. తాను సంతకం చేసిన తన జెర్సీని మెస్సీ జివాకు పంపించాడు. దానిపై ఫర్ జివా అని రాసి ఉంది. ఈ ఫొటోలను ధోనీ కూతురు తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. దానికి కొన్ని గంటల్లోనే లక్షల్లో లైకులు వచ్చాయి. 


లియోనెల్ మెస్సీ ఇంతకుముందు కూడా బీసీసీఐ కార్యదర్శి జైషాకు తన జెర్సీని గిఫ్ట్ గా పంపించాడు. ఈ విషయాన్ని భారత మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా తెలిపాడు. జైషా జెర్సీని పట్టుకుని ఉన్న ఫొటోను ఓజా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇలా మెస్సీ భారత అభిమానులపై తనకున్న ప్రేమను చాటుకుంటున్నాడు. 


ఇప్పట్లో రిటైరవ్వను


ప్రపంచ ఫుట్ బాల్ ప్రేమికులకు, ముఖ్యంగా మెస్సీ అభిమానులకు ఎంతో సంతోషకరమైన వార్త. 2022 ఫిఫా ప్రపంచకప్ తర్వాత అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ రిటైరవుతున్నాడంటూ వార్తలు వచ్చాయి. అయితే అవి ఊహాగానాలే అని తేలిపోయాయి. నేను ఇప్పట్లో రిటైరవ్వను అని స్వయంగా మెస్సీనే చెప్పాడు. ఈ వార్త ఈ స్టార్ ఫ్యాన్స్ కు పండగలాంటిదే.