Personal Finance tips:
కొన్ని రోజుల క్రితమే ఫిఫా ప్రపంచకప్ ముగిసింది. మరికొన్ని రోజుల్లో కొత్త ఏడాది మొదలవుతుంది! అర్జెంటీనా మూడో సారి విశ్వవిజేతగా నిలిచింది. చాలా మంది సరికొత్త సంవత్సరంలో విజయం అందుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. లయోనల్ మెస్సీ మైదానంలో చిరుతలా పరుగెత్తి వరల్డ్‌కప్ కల నెరవేర్చుకున్నాడు. అతడిలాగే ఎంతోమంది తమ ఆర్థిక కలలు సాకారం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నారు. ఫిఫా ప్రపంచకప్ మెథడ్‌నే అనుసరిస్తే ఇదేం అసాధ్యం కాదు!
గోల్ సెట్ చేసుకోండి!
ఫుట్‌బాలైనా, డబ్బులైనా మొదట మీరు చేయాల్సిన పని గోల్ సెట్ చేసుకోవడం! అగ్రశ్రేణి జట్లు 10-12 ఏళ్ల ముందే ఫిఫా ప్రపంచకప్‌నకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాయి. కొన్నేళ్లు కప్పు కలకు దూరమవుతున్న అర్జెంటీనా ఇలాగే చేసింది. చివరికి సాకారం చేసుకుంది. కారు, ఇల్లు, ముందుస్తు రిటైర్మెంట్ వంటి లక్ష్యాలను నిర్దేశించుకోండి. ఎన్ని రోజుల్లో నిజం చేసుకోవాలో నిర్ణయించుకోండి. ద్రవ్యోల్బణాన్ని బీట్ చేస్తూ ఎక్కువ రాబడి అందించే ఆర్థిక సాధనాల్లో పెట్టుబడి పెట్టండి. మీ లక్ష్యానికి ఎంత డబ్బు అవసరం అవుతుందో ముందే ప్లాన్ చేసుకోండి. సరైన మొత్తంలో డబ్బులు పెడితేనే కోరుకున్నది దక్కుతుంది.
మెస్సీని గుర్తించండి!
ఖతార్లో అందరినీ ఆకర్షించింది లయోనల్ మెస్సీనే! అప్పటికే అతడు దిగ్గజ ఆటగాడు. ఎన్నాళ్లుగానో ట్రోఫీ కోసం కష్టపడుతున్నాడు. కొన్ని మ్యాచుల్లో నిరాశపరిచాడు. ఫోకస్ పెట్టి పడిలేచిన కెరటంగా ఎగిశాడు. మార్కెట్లో ఎక్కువ రాబడి సృష్టించే విలువైన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడంపై మీరు ఫోకస్ పెట్టడం అవసరం. రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్ వంటివి సుదీర్ఘ కాలంలో ఎక్కువ లాభం అందించగలరు. మధ్యలో కొన్నాళ్లు ఒడుదొడుకులు వచ్చినా నిలబడగలవు. అయితే పెట్టుబడి పెట్టే ముందు పరిశోధన చేయడం ముఖ్యం. లాంగ్ టర్మ్‌లో ఎక్కువ రిటర్న్ అందించే బ్లూచిప్ కంపెనీలపై ఫోకస్ పెట్టండి. సెక్టార్లను బట్టి వైవిధ్యంగా పోర్టుఫోలియో నిర్మించుకోండి. అవి రాణించే వరకు సహనంతో ఉండండి.
బెంచ్ మార్క్ కీలకం!
ఫిఫాలో ఇప్పటి వరకు 205 దేశాలో పోటీపడ్డాయి. కేవలం 8 జట్లే ప్రపంచకప్‌లు గెలిచాయి. వ్యాపారంలోనూ ఇంతే. దేశంలో వేల కొద్దీ కంపెనీలు ఉన్నాయి. అందులో కొన్నే అత్యుత్తమంగా రాణిస్తాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం టాప్ 50 కంపెనీలను నిఫ్టీ 50 సూచీలో ఉంచారు. దానినే బెంచ్‌మార్క్ ఇండెక్స్ అంటారు. మీ వ్యక్తిగత స్టాక్స్‌తో దానిని బీట్ చేసేందుకు ప్రయత్నించాలి. ఇండెక్స్ ఫండ్, ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడి పెట్టడమూ ఓ మంచి పద్ధతే. అందుకే నిఫ్టీ 50, సెన్సెక్స్‌ను రోజూ గమనిస్తుండండి. వారెన్ బఫెట్ సైతం ఇండెక్స్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలని సూచించడం తెలిసిందే.
పొరపాట్లు చేయొద్దు!
ఆర్థిక సాధనాల్లో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. నిర్లక్ష్యం తగదు. నిజానికి ఫిఫాలో జర్మనీ ఓ గొప్ప జట్టు. కానీ తొలి రౌండ్లోనే ఘోర పరాజయం చవిచూసింది. ఒక చిన్న పొరపాటుతో వారు నాకౌట్‌కు చేరుకోలేకపోయారు. అలాంటి మిస్టేక్ మీరు చేయకండి. పోర్టుఫోలియోను వారానికో, నెలకో తప్పక సమీక్షించండి. మీ పోర్టుఫోలియో మీ లక్ష్యానికి అనుగుణంగా లేకపోతే ఆర్థిక సలహాదారును కలవండి.
నిలకడే అసలు మంత్రం!
ఆటైనా ఆర్థిక పెట్టుబడులైనా నిలకడగా రాణించడం అవసరం. మొరాకో ఓ చిన్న జట్టు. తన స్థాయితో పోలిస్తే ఈ ప్రపంచకప్‌లో ధాటిగా ఆడి సెమీస్ చేరుకుంది. ఇందుకు కారణం వారు నిలకడగా ఆటపై దృష్టి సారించడమే. 1986లో తొలిసారి ఆ దేశం ప్రి క్వార్టర్స్ చేరింది. మళ్లీ 36 ఏళ్లకు సెమీస్‌కు దూసుకొచ్చింది. ఈ మధ్య కాలంలో అక్కడి ప్రభుత్వం ఎన్నో పెట్టుబడులు పెట్టింది. ఆటగాళ్లను ప్రోత్సహించింది. దేశంలో ఫుట్‌బాల్‌పై అవగాహన కల్పించింది. కోచింగ్ స్టాఫ్‌ను నియమించింది. పొరపాట్లు నుంచి నేర్చుకొనేలా చేసింది. అందుకే స్పెయిన్, పోర్చుగల్ వంటి జట్లను ఓడించింది. మీరూ మొదట సిప్ విధానంలో పెట్టుబడులు పెట్టండి. కొన్ని సార్లు మార్కెట్లు పతనమైనా ఇన్వెస్ట్‌మెంట్లు కొనసాగించండి. షార్ట్ టర్మ్ లాభాలపై కాకుండా లాంగ్‌టర్మ్‌పై దృష్టి పెట్టండి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.