Housing Sales 2022: కరోనా పరిస్థితుల తర్వాత సొంత ఇళ్ల కోసం డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. దీంతో 2022 సంవత్సరం రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆకాశానికి ఎత్తేసింది. 2022లో రికార్డు స్థాయిలో ఇళ్లు అమ్ముడయ్యాయి. భారత్‌లోని టాప్ 7 నగరాల్లో ఇళ్లు/ఫ్లాట్ల అమ్మకాలు 2021తో పోలిస్తే, 2022లో 54 శాతం పెరిగాయి. అంతేకాదు, హై డిమాండ్‌ కారణంగా ఈ ఏడు నగరాల్లో ఇళ్ల ధరలు 4 నుంచి 7 శాతం వరకు పెరిగాయి. 


2014 రికార్డ్‌ బద్ధలు
హౌసింగ్ మార్కెట్ పరంగా దేశంలోని టాప్ 7 నగరాల్లో (దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌, పుణె) 2022లో హౌసింగ్ విక్రయాల గణాంకాలను రియల్‌ ఎస్టేట్‌ సర్వీసెస్‌ కంపెనీ అనరాక్ (ANAROCK Property Consultants) విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం, 2022లో ఈ ఏడు నగరాల్లో మొత్తం 3,64,900 హౌసింగ్ యూనిట్లు (ఇళ్లు, ఫ్లాట్లు) అమ్ముడయ్యాయి. 2021 కంటే ఇది 54 శాతం ఎక్కువ. 2021లో, మొత్తం 2,36,500 హౌసింగ్ యూనిట్లు అమ్ముడుపోయాయి. 


అంతకుముందు 2014లో 3.43 లక్షల ఇళ్లు/ఫ్లాట్లు అమ్ముడయ్యాయి, ఇప్పటి వరకు ఇదే రికార్డ్‌. 2022లో ఈ రికార్డ్‌ బద్ధలైంది. ప్రాపర్టీ ధరలు పెరగడం, కొత్త ప్రాజెక్టులు తగ్గడం, గృహ రుణ వడ్డీ రేట్లు పెరగడం, ప్రపంచ మార్కెట్ల నుంచి ఒత్తిడి వంటివి ఉన్నప్పటికీ... 2022లో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్‌ చాలా అద్భుతంగా ప్లే అయిందని అనరాక్ ఛైర్మన్ అనుజ్ పురి వెల్లడించారు.


టాప్‌లో ముంబయి, హైదరాబాద్‌లో 87 శాతం వృద్ధి
ఎప్పటిలాగే, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌ (MMR) టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. 2022లో, MMRలో మొత్తం 1,09,700 హౌసింగ్ యూనిట్లు సేల్‌ అయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో దిల్లీ NCR నిలిచింది. దిల్లీ NCRలో మొత్తం 63,700 సొంతిళ్ల అమ్మకాలు జరిగాయి. బెంగళూరులో 49,478, పుణెలో 57,146, చెన్నైలో 16,097, కోల్‌కతాలో 21,200 ఇళ్లు అమ్ముడయ్యాయి. హైదరాబాద్‌లో 2021లో 25,406 ఇళ్లు/ఫ్లాట్లు అమ్ముడవగా, 2022లో ఏకంగా 87 శాతం వృద్ధితో 47,487 యూనిట్లను స్థిరాస్తి సంస్థలు విక్రయించాయి. 


హైదరాబాద్‌లో కొత్త ఇళ్ల జోరు
అనరాక్ రిపోర్ట్‌ ప్రకారం... 2022లో టాప్‌ 7 సిటీల్లో కొత్తగా 3,57,600 హౌసింగ్ యూనిట్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. 2021లో ప్రారంభించిన 2,36,700 యూనిట్ల కంటే ఇది 51 శాతం ఎక్కువ. 2014లో మాత్రం, ఈ ఏడు నగరాల్లో కలిపి 5.45 లక్షల కొత్త హౌసింగ్ యూనిట్లను స్థిరాస్తి సంస్థలు ప్రారంభించాయి. దీంతో పోలిస్తే 2022లో కొత్త ఇళ్ల నిర్మాణాలు చాలా తక్కువ. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, హైదరాబాద్‌లో ఎక్కువ సంఖ్యలో కొత్త హౌసింగ్ యూనిట్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. మొత్తం టాప్‌ 7 నగరాల్లో, ఈ రెండు నగరాల వాటా 54 శాతం.


అనరాక్‌ గణాంకాల ప్రకారం, 35 శాతం యూనిట్లు రూ. 40 నుంచి 80 లక్షల పరిధిలో ఉన్నాయి. 28 శాతం యూనిట్లు రూ. 80 లక్షల నుంచి రూ. 1.5 కోట్ల రేంజ్‌లో ఉన్నాయి. రూ. 1.5 కోట్ల విలువ కంటే అధిక శ్రేణిలో 17 శాతం హౌసింగ్ యూనిట్లు ప్రారంభమయ్యాయి. 


7 శాతం పెరిగిన ఇళ్ల రేట్లు
2022లో, టాప్ 7 నగరాల్లో ఇళ్ల ధరలు 7 శాతం వరకు పెరిగాయి. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, బెంగళూరులో గరిష్ట పెరుగుదల కనిపించింది. ఈ రెండు నగరాల్లో ధరలు 7 శాతం పెరిగాయి. హైదరాబాద్‌లో 6 శాతం, దిల్లీ NCR, పుణె, చెన్నైలో 5 శాతం పెరిగాయి. కోల్‌కతాలో సొంత ఇళ్ల రేటు 4 శాతం పెరిగింది.