Bharat Bandh: జులై 9 బుధవారం దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు పాతికోట్ల మంది 25 కోట్ల ప్రభుత్వ రంగ ఉద్యోగులు, కార్మికులు, రైతులు, వివిధ రంగాల కార్మిక సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో చాలా రంగాలపై తీవ్ర ప్రభావం పడనుంది. జన జీవనం స్తంభించిపోనుంది. కార్యకలాపాలు ఆగిపోనున్నాయి. కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. చాలా కాలం తర్వాత భారత్ బంద్‌కు కారణమేంటీ? ఈ సమ్మెకు పిలుపునిచ్చింది ఎవరు? ఇందులో ఎవరెవరు పాల్గొంటారు? ఏ ఏ రంగాలపై ప్రభావం పడుతుందో ఇక్కడ చూద్దాం.
భారత్ బంద్‌కు ఎవరు పిలుపునిచ్చారు?
కేంద్ర ప్రభుత్వ విధానాలపై కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు రగిలిపోతున్నారు. తీవ్ర అసంతృప్తితో తమ హక్కులు సాధించుకోవడానికి దేశవ్యాప్తంగా సమ్మె బాట పట్టారు. దేశంలోని పది ప్రధాన కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు కలిసి ఈ బంద్ కాల్ ఇచ్చాయి. అవి
- ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (AITUC)
- ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (INTUC)
- సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ (CITU)
- హింద్ మజ్దూర్ సభ (HMS)
- సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్ (SEWA)
- లేబర్ ప్రోగ్రెసివ్ ఫెడరేషన్ (LPF)
- యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (UTUC)
ఈ సంఘాలతోపాటు సంయుక్త కిసాన్ మోర్చా వంటి రైతు సంఘాలు, గ్రామీణ కార్మిక సంఘాలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులైన రైల్వే, NMDC, స్టీల్ ఇండస్ట్రీ కార్మికులు కూడా ఈ భారత్ బంద్‌లో భాగమవుతున్నారు.
ఎందుకు బంద్? కార్మిక సంఘాల డిమాండ్లు ఏంటీ ?
కార్మిక హక్కులపై దాడి: కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎప్పటి నుంచో కార్మికులు తప్పుబడుతున్నారు. ఈ మధ్య కాలంలో తీసుకొచ్చిన నాలుగు కొత్త కార్మిక కోడ్స్‌తో ఆ అసంతృప్తి మరింతగా పెల్లుబికింది. ఈ కోడ్స్ వల్ల కార్మికుల సమాఖ్య హక్కులు, సమ్మె హక్కులు పోతాయని వాటితోపాటు ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని వాపోతున్నాయి యూనియన్లు.
ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు: రిటైర్ అయిన వారి స్థానంలో ఉద్యోగాలు నియమించడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. కొన్ని శాఖల్లో రిటైర్ అయిన వారినే తిరిగి నియమిస్తున్నారని అంటున్నారు. దీని వల్ల నిరుద్యోగ సమస్య పెరుగుతుందని ఉద్యోగాల్లో ఉన్న వారిపై ఒత్తిడి పెరుగుతుందని వాపోతున్నారు.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం: ధరలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్య కారణంగా సామన్యుల బతుకులు భారంగా మారుతున్నాయని అంటున్నారు. ఈ భారత్ బంద్‌కు ఇది కూడా కారణంగా చెబబుతున్నారు.
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ: బ్యాంకింగ్, కోల్, రైల్వే, పోస్టల్, స్టీల్ వంటి కీలక రంగాల్లో ప్రైవేటీకరణ పెరుగుతోందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఇది భవిష్యత్‌లో నిరుద్యోగతను పెంచుతుందని, ఉద్యోగ భద్రత లేకుండా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కీలకమైన రంగాలపై ఖర్చుల తగ్గింపు: ఆరోగ్య, విద్య, మౌలిక వసతులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆయా రంగాలపై ఖర్చులను ప్రభుత్వ తగ్గిస్తోంది. ఆ బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడుతున్నాయి.
పబ్లిక్ సెక్యూరిటీ బిల్లుల ద్వారా నిరసనలను అణచివేస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నాయి. అందుకే ఇలాంటి చట్టాలు చేయడం మానుకోవాలని అభ్యర్థిస్తున్నారు.
ప్రధాన డిమాండ్లు ఏంటంటే?
- నాలుగు కార్మిక కోడ్స్‌ను రద్దు చేయాలి.
- కార్మిక సంఘాల హక్కులను పునరుద్ధరించాలి.
- ప్రభుత్వ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి.
- యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలి.
- MGNREGA వేతనాలు పెంచాలి, పట్టణ ప్రాంతాలకు ఆ పథకానికి విస్తరించాలి.
- ఆరోగ్య, విద్య, మౌలిక వసతుల బలోపేతం చేయాలి.
ఎవరెవరు పాల్గొంటున్నారు?
బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, పోస్టల్, మైనింగ్, రైల్వే, ట్రాన్స్‌పోర్ట్, స్టీల్, విద్యుత్, ప్రభుత్వ ఉద్యోగులు ఈ భారత్ బంద్‌లో పాల్గొంటారు. రైతు సంఘాలు, గ్రామీణ కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు కూడా బంద్‌కు జై కొడుతున్నాయి.
బంద్ ప్రభావం ఏ రంగాలపై ఉంటుంది?
బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ కంపెనీలు మూతపడే అవకాశం ఉంది. పోస్టాఫీసులు, మైనింగ్, పరిశ్రమల కార్యకలాపాలు నిలిచిపోవచ్చు. ప్రభుత్వ బస్సులు, రైల్వే సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ శాఖలు, పబ్లిక్ సెక్టార్ యూనిట్లు నడవకపోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, కార్మికులు పెద్ద ఎత్తున ర్యాలీలు, నిరసనలు చేపట్టనున్నారు.
ఈ రంగాలకు సెలవులు లేనట్టే
పాఠశాలలు, కళాశాలలు మూతపడే అవకాశం లేదు. తరగతులు యథావిధిగా సాగుతాయి. ప్రైవేట్ కార్యాలయాలు తెరిచే ఉంచుతారు. రైళ్లు రద్దు అవుతున్నట్టు అధికారిక ప్రకటన లేదు. బంద్ కారణంగా కొన్ని రైళ్లు ఆలస్యాలు నడవచ్చు. మరికొన్ని రద్దు అయ్యే ఛాన్స్ ఉంది.