FIFA WC 2022:  ఫిఫా ప్రపంచకప్ గెలిచి స్వదేశానికి వెళ్లిన అర్జెంటీనా జట్టుకు ఘనస్వాగతం లభించింది. 36 ఏళ్ల తర్వాత దేశానికి ఫుట్ బాల్ ప్రపంచకప్ తెచ్చిన హీరోలను చూడ్డానికి జనం రోడ్ల మీద బారులు తీరారు. మంగళవారం అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ కు లక్షలాది మంది అభిమానులు తరలివచ్చారు. అక్కడినుంచి విజయోత్సవ యాత్ర ప్రారంభమైంది. సుమారు 40 లక్షల మంది ఈ రోడ్ షోలో పాల్గొన్నట్లు సమాచారం. 


అభిమానుల అత్యుత్సాహం


ట్రోఫీ గెలిచిన అర్జెంటీనా క్రీడాకారులు ఓపెన్ టాప్ బస్సులో నుంచి అభిమానులకు అభివాదం చేశారు. కప్పును వారికి చూపించారు. కొంతమంది ఆటగాళ్లు బస్సులో డ్రమ్ములు వాయించారు. డ్యాన్స్ చేశారు. కొందరు తమ దేశ జెండాను ఊపుతూ కనిపించారు. వారిని చూసేందుకు జనం అమితాసక్తి చూపించారు. హైవే, ఓవర్ పాస్, ఫ్లై ఓవర్ అన్నీ జనంతో నిండిపోయాయి. కొంతమంది అభిమానులు బ్రిడ్జి పైనుంచి ఆటగాళ్లు ఉన్న బస్సులోకి రావడానికి ప్రయత్నించారు. దీంతో కాసేపు విక్టరీ పరేడ్ ను నిలిపివేయాల్సి వచ్చింది. 






అభిమానులను అదుపు చేయడం భద్రతా సిబ్బందికి కష్టమైంది. దాంతో ఆటగాళ్లను బస్సులో నుంచే నేరుగా హెలికాఫ్టర్ ఎక్కించి అక్కడినుంచి అర్జెంటీనా ఫుట్ బాల్ ఫెడరేషన్ కు తరలించారు. దీంతో వారిని చూడడానికి వచ్చిన వారు నిరాశగా వెనుదిరిగారు. అంతకుముందు రాత్రి అర్జెంటీనా జట్టు బ్యూనస్ ఎయిర్స్ విమానాశ్రయానికి చేరుకుంది, అక్కడి నుండి జట్టును ఓపెన్ బస్సులో అర్జెంటీనా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌కు తీసుకువచ్చారు. ఈ సమయంలో కూడా ఆటగాళ్లను చూసేందుకు లక్షలాది మంది అభిమానులు తరలివచ్చారు.