Sunil Chhetri GOAT Of Indian Foot ball: భారత ఫుట్ బాల్ జట్టుకు ఈ ఏడాది తీరని లోటును మిగిల్చింది. స్టార్ ఫుట్ బాలర్ సునీల్ ఛెత్రి అంతర్జాతీయ కెరీర్ కు వీడ్కోలు ఈ ఏడాదే పలికాడు. జూన్ 6న కువైట్ తో ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్ ముగిసిన తర్వాత కెరీర్ కు గుడ్ బై చెబుతానని మేలోనే ప్రకటించాడు. ఆ తర్వాత ఆ మ్యాచ్ ముగిసిన అనంతరం సోషల్ మీడియా వేదికగా తన ఫుట్ బాల్ ఆటకు ఈ 40 ఏళ్ల ప్లేయర్ అల్విదా ప్రకటించాడు. దిగ్గజం బైచుంగ్ భుటియా తర్వాత దేశంలో ఫుట్ బాల్ లో అంతటి క్రేజ్ ని సొంతం చేసుకున్న వ్యక్తిగా ఛెత్రిని చెప్పవచ్చు. భారత్ తరపున అత్యధిక అంతర్జాతీయ గోల్స్ తో తన సత్తా చాటాడు. అలాగే అత్యధిక గోల్స్ చేసిన ఇంటర్నేషనల్ ప్లేయర్లలో తను నాలుగో స్థానంలో నిలిచాడు. 2005లో అరంగేట్రం చేసిన ఛెత్రి.. తన 19 ఏళ్ల కెరీర్లో సాధించిన ఘనతలు చూద్దామా..


అత్యధిక గోల్స్: భారత్ తరపున అత్యధిక గోల్స్ సాధించిన ప్లేయర్ గా చెత్రి రికార్డులకెక్కాడు. కెరీర్లో తను 94 గోల్స్ సాధించడం విశేషం. ఓవరాల్ గా అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాళ్ల జాబితాలో క్రిస్టియానో రొనాల్డో (135- పోర్చుగల్), లియనెల్ మెస్సీ (112-అర్జెంటీనా), అలీ డే (108) తర్వాత ఛెత్రి నిలిచాడు. వీళ్ల తర్వాత మరే ఏ ఇతర ఆటగాడికి 90కి పైగా అంతర్జాతీయ గోల్స్ లేకపోవడం విశేషం. 


అత్యధిక మ్యాచ్ లు: భారత్ తరపున అత్యధిక మ్యాచ్ లు ఆడిన ప్లేయర్ గా ఛెత్రి ఖ్యాతి గడించాడు. తను 151 మ్యాచ్ ల్లో భారత్ తరపున బరిలోకి దిగాడు. 2005లో పాకిస్థాన్ తో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్ లో అరంగేట్రం చేసిన ఛెత్రి.. అలా తన ప్రయాణాన్ని 19 ఏళ్ల పాటు కొనసాగించాడు. భారత్ తరపున 150కి పైగా అంతర్జాతీయ మ్యాచ్ లాడిన ఏకైక ప్లేయర్ ఛెత్రినే కావడం విశేషం. 104 మ్యాచ్ లతో భైచుంగ్ భుటియా రెండో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో గుర్ప్రీత్ సింగ్ సంధూ 75 మ్యాచ్ ల్లో భారత్ కు ప్రాతినిథ్యం వహించాడు. 


అత్యధిక హాట్రిక్స్: అంతర్జాతీయ కెరీర్లో ఛెత్రీ పేరిట నాలుగు హ్యాట్రిక్ లు ఉన్నాయి. తెలుగు దిగ్గజ ప్లేయర్ కే.అప్పలరాజు తర్వాత అంతర్జాతీయ కెరీర్లో మల్టిపుల్ హ్యాట్రిక్ లు సాధించిన ప్లేయర్ ఛెత్రీనే కావడం విశేషం. తన కెరీర్ లో నాలుగు హ్యాట్రిక్స్ సాధించిన ఛెత్రీ.. చివరగా 2023 శాఫ్ చాంపియన్ షిప్ లో పాకిస్థాన్ పై హ్యాట్రిక్ సాధించాడు. అంతకుముందు తజకిస్తాన్ (2008), వియత్నాం (2010), చైనీస్ తైపీ (2018)లపై హ్యాట్రిక్స్ సాధించాడు. 


మూడు దశాబ్దాల్లోనూ గోల్స్: సునీల్ ఛెత్రీ తన కెరీర్ లో అరుదైన ఘనతను కలిగి ఉన్నాడు. భారత్ కు ప్రాతినిథ్యం వహించి, మూడు దశాబ్ధాల్లో గోల్స్ చేసిన ఏకైక ప్లేయర్ గా నిలిచాడు. గతేడాది ఫిపా ప్రపంచకప్ క్వాలిఫయర్స్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో గోల్ చేయడం ద్వారా ఈ ఘనత సాధించాడు. 


ఖేల్ రత్న: క్రీడల్లో దేశంలో ఇచ్చే అత్యున్నత పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును స్వీకరించిన ఏకైక ఫుట్ బాలర్ గా సునీల్ ఛెత్రి రికార్డులకెక్కాడు. 2021లో తను ఈ అవార్డు అందుకున్నాడు. ఆ ఏడాది ఛెత్రితోపాటు మొత్తం 12 మంది అథ్లెట్లు ఈ అత్యున్నత పురస్కారాన్ని సొంత చేసుకున్నారు.  


Also Read: Travis Head Injured: ట్రావిస్ హెడ్ కు గాయం..! ప్రాక్టీస్ సెషన్ కి డుమ్మా.. నాలుగో టెస్టుకి డౌటే..!!