Ind Vs Aus 4th Test: భారత్ తో జరుగుతున్న ఐదు టెస్టుల బోర్డర్ -గావస్కర్ ట్రోఫీ(బీజీటీ)లో ఆస్ట్రేలియాకు ఎదురు దెబ్బ తగిలినట్లే కనిపిస్తోంది. ఆ జట్టు స్టార్ బ్యాటర్, సిరీస్ లీడింగ్ స్కోరర్ ట్రావిస్ హెడ్ గాయపడినట్లు సమాచారం. సోమవారం జట్టు ప్రాక్టీస్ సెషన్ ను మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరుపగా, దానికి హెడ్ గైర్హాజరయ్యాడు. అయితే బ్రిస్బేన్ లో జరిగిన మూడో టెస్టులో గాయపడిన హెడ్, ఇంకా కోలుకోక పోవడంతోనే తను ప్రాక్టీస్ కు రాలేదని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే సోమవారం ఆప్షనల్ ప్రాక్టీస్ కాబట్టి, హెడ్ హాజరు కాలేదని టీమ్ మేనేజ్మెంట్ చెప్పుకొచ్చింది. మ్యాచ్ ప్రారంభమవ్వడానికి మరో రెండు రోజుల గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో హెడ్ బరిలోకి దిగకపోవడం అనుమానాన్ని రేకెత్తిస్తోంది. 






గాయపడిన హెడ్..
నిజానికి మూడో టెస్టు రెండో ఇన్సింగ్స్ లో హెడ్ గాయపడ్డాడు. కాస్త అసౌకర్యంగానే క్రీజులో కదలిన హెడ్.. భారత్ ఇన్నింగ్స్ సందర్భంగా మైదానంలోకి రాలేదు. నిజానికి ఆ మ్యాచ్ లో వర్షం పలుమార్లు అంతరాయం కలిగించడంతో ప్లేయర్లకు కావాల్సినంత విశ్రాంతి దొరికింది. అలాగే మూడో టెస్టు ముగిసి నాలుగు రోజులైనా హెడ్ ఇంకా గాడిన పడకం పోవడం అనుమానాలకు తావిస్తోంది. తను గాయపడినందు వల్లనే ప్రాక్టీస్ కి రాలేదని పలువురు భావిస్తున్నారు. ఇక ఈ సిరీస్ లో హెడ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. 409 పరుగులతో లీడింగ్ రన్ స్కోరర్ గా నలిచాడు. 


Also Read: Manu Bhaker News: మను భాకర్ కు షాక్- ఖేల్ రత్న నామినేషన్లలో తన పేరు గల్లంతు, అశ్విన్ కోసం తమిళ ఎంపీ లాబీయింగ్!..


ఇక బీజీటీ సిరీస్ కు సీనియర్ పేసర్ మహ్మద్ షమీ అందుబాటులో ఉండటం లేదని భారత బోర్డు తెలిపింది. తను చీలమండ గాయం నుంచి కోలుకున్నప్పటికీ, మోకాలిలో వాపు కారణంగా మిగతా టెస్టుల్లో ఆడించడం లేదని పేర్కొంది. నిజానికి షమీ గాయం నుంచి కోలుకుని, రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడాడు. అందులో సత్తా చాటి, తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. అయితే అతన్ని బీజీటీలో ఆడించి రిస్క్ చేయించాలని బీసీసీఐ ఏమాత్రం ఆలోచించడం లేదు. ఇక ఐదు టెస్టుల సిరీస్ 1-1తో సమంగా ఉంది. తొలి టెస్టులో భారత్ గెలుపొందగా, రెండో టెస్టును కంగారూలు కైవసం చేసుకున్నారు. వర్షం పలుమార్లు అంతరాయం కలగడం వల్ల మూడో టెస్టు డ్రాగా ముగిసింది. ఈనెల 26 నుంచి బాక్సింగ్ డే రోజున నాలుగో టెస్టు మెల్ బోర్న్ లో జరుగుతుంది. ఐదో టెస్టు సిడ్నీలో వచ్చేనెల 3 నుంచి ప్రారంభమవుతుంది. 


Also Read: Ind Vs Aus Test Series: ప్రాక్టీస్ పిచ్ ల లొల్లి.. భారత్‌కు పాతవి, ఆసీస్ కు కొత్తవి కేటాయింపు- అభిమానుల గుస్సా