Melbourne Test: భారత్, ఆస్ట్రేలియా జట్లు బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగో టెస్టుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇరుజట్లు ముమ్మరంగా సాధన చేస్తున్నాయి. అయితే తాజాగా ప్రాక్టీస్ పిచ్ ల విషయంలో వివాదం మొదలైంది. ముఖ్యంగా భారత ప్లేయర్లు ఆడుతున్న ప్రాక్టీస్ పిచ్లను చూసి అభిమానులు పెదవి విరుస్తున్నారు. టీమిండియా ప్లేయర్లకు ఆల్రెడీ వాడేసిన పిచ్ లను ప్రాక్టీస్ కోసం కేటాయిస్తున్నారని, అదే ఆసీస్ ఆటగాళ్లకు మాత్రం తళతళలాడుతున్న కొత్త ప్రాక్టీస్ పిచ్ లను ఇచ్చారని వాదనలు మొదలయ్యాయి. గత వారం నుంచి భారత జట్టు మెల్ బోర్న్ లో ప్రాక్టీస్ చేస్తోంది. అయితే ఆసీస్ మాత్రం సోమవారం నుంచి ప్రాక్టీస్ మొదలు పెట్టింది. రెండు జట్ల పిచ్ లకు సంబంధించి క్లిప్పింగ్ లను అభిమానులు సోషలో మీడియాలో వైరల్ చేస్తున్నారు.
లో బౌన్స్, కష్టాలు..
ఇక వాడేసిన ప్రాక్టిస్ పిచ్ ల వల్ల కొన్ని నష్టాలున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఊహించినంత బౌన్స్ అందులో రాదని, ఆటగాళ్లు గాయాల బారిన పడే అవకాశముందని చెబుతున్నారు. ముఖ్యంగా షార్ట్ పిచ్ బంతులు వేసినప్పటికీ, అవి బ్యాటర్ నడుం కంటే తక్కువ ఎత్తుకే వస్తాయని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మోకాలి గాయానిక గురయ్యాడని పేర్కొంటున్నారు. మరికొందరు బ్యాటర్లు అసౌకర్యానికి గురయ్యారని తెలుస్తోంది. మరోవైపు తాజాగా పేసర్ ఆకాశ్ దీప్ ఈ వివాదంపై స్పందించాడు. తమకు యూస్డ్ పిచ్ లు ఇచ్చిన మాట వాస్తవమేనని అంగీకరించాడు. ఆ పిచ్ లు వైట్ బాల్ క్రికెట్ కోసం తయారు చేసినవని, అందుకే బౌన్స్ అంతగా రావట్లేదని పేర్కొన్నాడు. ఏదేమైనా ఆటలో ఇవన్నీ సహజమని తేలిగ్గా తీసుకున్నాడు.
నిబంధనల ప్రకారమే..
ప్రాక్టీస్ పిచ్ ల వివాదంపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కు చెందిన మెల్ బోర్న్ క్యూరేటర్ మ్యాట్ పేజ్ స్పందించాడు. నిబంధనల ప్రకారం కొత్త ప్రాక్టీస్ పిచ్ లను మ్యాచ్ కు మూడు రోజుల ముందుగానే ఆటగాళ్లకు కేటాయిస్తామని పేర్కొన్నారు. భారత జట్టు గత వారం నుంచి ప్రాక్టీస్ ప్రారంభించిందని, అందుకే వాళ్లు ఆడుతున్న ప్రాక్టీస్ పిచ్ లు పాతగా కనిపిస్తున్నాయని తెలిపాడు. ఇక మ్యాచ్ కు మూడు రోజులు ముందు అంటే సోమవారం ఆసీస్ ప్రాక్టీస్ మొదలు పెట్టినందున వారికి కొత్త ప్రాక్టీస్ పిచ్ లు కేటాయించామని తెలిపారు. సోమవారం ఆసీస్ ఆటగాళ్ల సాధన నేపథ్యంలో భారత జట్టు ప్రాక్టీస్ లో పాల్గొనలేదు. వాళ్లు మళ్లీ సాధన మొదలు పెట్టినప్పుడు ఏ పిచ్ పై ప్రాక్టీస్ చేస్తున్నారో చూస్తూ అసలు నిజం తెలుస్తుందని అభిమానులు పేర్కొంటున్నారు. ఏదేమైనా ఐదు టెస్టుల సిరీస్ పసందుగా జరుగుతోంది. ఇరుజట్లు పోటాపోటీగా ఆడుతుండటంతో సిరీస్ 1-1తో సమమైంది. తొలి టెస్టును 295 పరుగులతో భారత జట్టు దక్కించుకోగా, పది వికెట్లతో రెండో టెస్టును ఆసీస్ తన ఖాతాలో వేసుకుంది. వర్షం పలుమార్లు అంతరాయం కలిగించడంతో మూడో టెస్టు డ్రాగా ముగిసింది. సిరీస్ లో నాలుగో టెస్టు ఈనెల 26న బాక్సింగ్ డే రోజున మెల్ బోర్న్ లో జరుగుతుంది.