ఆదివారం నుంచి ఖతార్‌లో ప్రారంభం కానున్న ఫిఫా ప్రపంచ కప్ 2022 కోసం ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అయితే ఈ ప్రపంచ కప్‌లో మహిళా అభిమానులు కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి. దేశంలోని కఠినమైన చట్టాల ప్రకారం శరీరం ఎక్కువగా కనిపించే దుస్తులను ధరిస్తే వారిని జైలులో వేసే అవకాశం ఉంది.
ఖతార్ దేశానికి చెందని మహిళలు 'అబాయా' అని పిలిచే సాంప్రదాయిక పొడవాటి నల్లని వస్త్రాన్ని ధరించాలని అధికారిక ఆదేశాలు ఏమీ లేవు. కానీ వారు తమ భుజాలు, మధ్యభాగం లేదా మోకాళ్లను బహిర్గతం చేసే దుస్తులకు దూరంగా ఉండాలి. ఫిఫా వెబ్‌సైట్‌లో కూడా ఇదే తెలిపారు. అభిమానులకు వారి ఇష్టానికి అనుగుణంగా దుస్తులు ధరించవచ్చు. కానీ ఖతార్ చట్టాలను గౌరవించాలి.
"ప్రజలు సాధారణంగా తమకు నచ్చిన దుస్తులను ధరించవచ్చు. మ్యూజియంలు, ఇతర ప్రభుత్వ భవనాలు వంటి బహిరంగ ప్రదేశాలను సందర్శించేటప్పుడు సందర్శకులు వారి భుజాలు, మోకాళ్లను కప్పి ఉంచితే మంచిది. హోటల్ బీచ్‌లు, కొలనుల వద్ద ఈత దుస్తులను అనుమతిస్తారు. మ్యాచ్‌లకు హాజరయ్యే అభిమానులు షర్టులను తీసివేయడాన్ని స్టేడియంలో అనుమతించరు." అని ఫిఫా వెబ్‌సైట్లో పేర్కొంది.
ఖతార్ విదేశీయుల కోసం దుస్తుల కోడ్‌ను చట్టపరంగా ఎక్కడా పేర్కొనలేదు. అయితే సందర్శకులు, అభిమానులు ఇస్లామిక్ సంస్కృతి ప్రకారం "నమ్రత" ప్రదర్శించే దుస్తులను ధరించాలని భావిస్తున్నారు. దీనర్థం పురుషులు ఎల్లప్పుడూ షార్ట్‌లు కాకుండా పొడవాటి ప్యాంట్లు ధరిస్తే మంచిది. అలాగే నచ్చినప్పుడు షర్టులు విప్పేయకూడదు. ఇక మహిళలు మినీ స్కర్ట్‌లు, ట్యాంక్ టాప్‌లకు దూరంగా ఉండాలి. ఖతార్‌లో మహిళలు బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం నిషేధితం అయిందని తెలుస్తోంది.
“ఖతార్‌లోని మహిళలు హిజాబ్ ధరించాల్సిన అవసరం లేదు. అయితే స్థానిక దుస్తుల కోడ్‌ను గమనించాలి. పురుషులు, స్త్రీలు భుజాలు, పై చేతులను కప్పి ఉంచుకోవాలి. షార్ట్‌లు లేదా స్కర్టులు/డ్రెస్‌లు మోకాలి వరకు లేదా అంతకంటే కిందకు ఉండాలి.” అని ఖతార్‌లోని బ్రిటీష్ రాయబార కార్యాలయం సూచించింది.