ఫుట్‌బాల్ అనేది క్రీడ కంటే చాలా ఎక్కువ, ప్రజలను ఒకచోట చేర్చే "ప్రత్యేకమైన మాయాజాలపు" శక్తిని కలిగి ఉంది అని FIFA అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినో అన్నారు. 2022 FIFA ప్రపంచ కప్‌కు ముందు ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
ఇండోనేషియాలోని బాలిలో జరుగుతున్న జీ20 సమ్మిట్‌కు హాజరైన ఇన్ఫాంటినో ఉద్రిక్తతలు, వివాదాలను పక్కనపెట్టి, నవంబర్ 20వ తేదీ నుంచి డిసెంబర్ 18వ తేదీ వరకు ఖతార్‌లో జరగనున్న ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ను ఆస్వాదించాలని ప్రపంచ నాయకులకు పిలుపునిచ్చారు. ప్రపంచ కప్ ఆనందం, ఐక్యతకు ఒక సందర్భం కావాలని ఇన్ఫాంటినో అన్నారు.
వందల బిలియన్ల డాలర్ల GDPతో ఫుట్‌బాల్ కూడా ఒక ముఖ్యమైన ఆర్థిక కార్యకలాపమని, మిలియన్ల కొద్దీ ఉద్యోగాలను సృష్టించి, ఆర్థిక వృద్ధికి ఊతమిస్తుందని ఇన్ఫాంటినో చెప్పారు. ఖతార్‌లో జరిగే ఫిపా ప్రపంచ కప్‌ను 500 కోట్ల మంది వీక్షిస్తారని అంచనా వేశారు. అంటే ప్రపంచ జనాభాలో సగానికి పైగా అన్నమాట.
2031లో FIFA ఉమెన్స్ వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇవ్వాలనే చైనా ప్రణాళికను కూడా తెలిపారు. చైనాలో ఫుట్‌బాల్ సంస్కృతిని ఎలా అమలు చేయాలనే దానిపై ఫిఫా చర్చిస్తోందని, యువతీ యువకులు ఫుట్‌బాల్ క్రీడాకారులు కావాలని కలలు కంటున్నారని, వారికి జట్టు స్ఫూర్తిని మరియు ఒకరినొకరు గౌరవించడాన్ని నేర్పించాలని ఆయన అన్నారు.
స్పానిష్ ఫుట్‌బాల్ కోచ్ లూయిస్ ఎన్రిక్ ఖతార్ ప్రపంచ కప్ ఫైనల్స్‌లో అభిమానులకు మరింత చేరువయ్యేలా ఆశ్చర్యకరమైన ప్రకటన చేసాడు. టోర్నమెంట్ సమయంలో అతను ఆన్‌లైన్ "స్ట్రీమర్" అవుతానని ప్రకటించాడు. స్పెయిన్ కోచ్ దీనికి సంబంధించిన ఒక వీడియోను విడుదల చేశాడు, అందులో అతను అభిమానులతో లైవ్ వీడియో కనెక్షన్లను ఏర్పాటు చేస్తానని చెప్పాడు.