FIFA World Cup: ఫిఫా వరల్డ్ కప్ నవంబర్ 20 నుంచి ప్రారంభం కానుంది. అర్జెంటీనా స్టార్ ఫుట్ బాల్ ఆటగాడు లియోనల్ మెస్సీ తన ఐదో ప్రపంచకప్ ను ఆడనున్నాడు. 35 ఏళ్ల మెస్సీకి తన కెరీర్లో ఇదే చివరి ప్రపంచకప్ కావచ్చు. కెప్టెన్ గా, ఆటగాడిగా ఎన్నో రికార్డులు నెలకొల్పిన మెస్సీకి ప్రపంచకప్ మాత్రం ఇంతవరకు అందలేదు. అందుకే ఈసారి ఆ కల నెరవేర్చుకోవాలని అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆ టీం కూడా మంచి ఫామ్ లో ఉంది. ఇదే చివరి వరల్డ్ కప్ కావచ్చొన్న అంచనాలున్న నేపథ్యంలో ప్రపంచకప్ గెలిచి తన కెరీర్ కు ఘనంగా వీడ్కోలు పలికేందుకు ఇది గొప్ప అవకాశం. అయితే తన కలను నెరవేర్చుకోవడంలో 3 జట్లు తనకు అతిపెద్ద సవాల్ గా నిలుస్తాయని మెస్సీ అభిప్రాయపడ్డాడు.
ఆ మూడే అడ్డంకి
అర్జెంటీనా ప్రపంచకప్‌ను గెలవడానికి ఇంగ్లండ్, బ్రెజిల్, ఫ్రాన్స్ అతిపెద్ద అడ్డంకిగా మారొచ్చని లియోనెల్ మెస్సీ అభిప్రాయపడ్డాడు. సౌత్ అమెరికన్ ఫెడరేషన్ కాన్బిమోల్ తో మాట్లాడుతూ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. "మేము ప్రపంచ కప్ గెలవడానికి పోటీదారుల గురించి మాట్లాడినప్పుడు ఆ 3 జట్ల పేర్లు చర్చకు వస్తాయి. ఈసారి బ్రెజిల్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ ఇతర జట్ల కంటే చాలా మెరుగ్గా ఉన్నాయని నేను భావిస్తున్నాను. ప్రపంచకప్‌లో ఏదైనా జరగవచ్చు.' అని మెస్సీ అన్నాడు. అయితే తాము చాలా ఉత్సాహంగా ఉన్నామని చెప్పాడు. తమ అత్యుత్తమ ఆటతో లక్ష్యం వైపు చేరుకుంటామని ఆశాభావం వ్యక్తంచేశాడు.
35 ఏళ్ల లియోనెల్ మెస్సీ 2014 ప్రపంచ కప్‌లో తన జట్టును ఫైనల్‌కు చేర్చాడు, అయితే ఇక్కడ అతని జట్టు జర్మనీపై అదనపు సమయంలో ఓడిపోయింది. దీని తర్వాత, 2018 ప్రపంచ కప్‌లో అర్జెంటీనా ఫ్రాన్స్ చేతిలో నోస్-అవుట్ మ్యాచ్‌లో ఓడిపోవడంతో కప్ కల నెరవేరలేదు.
35 మ్యాచుల్లో గెలుపు
ప్రస్తుతం అర్జెంటీనా జట్టు బలంగా ఉంది. మంచి ఫాం లో ఉంది. గత 35 మ్యాచుల్లో ఆ జట్టుకు ఓటమన్నదే లేదు. కాబట్టి ఈసారి ఆ జట్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. ఖతార్‌లో ప్రారంభమయ్యే ప్రపంచకప్‌లో అర్జెంటీనా గ్రూప్-సిలో ఉంది. ఆ జట్టుతో పాటు ఈ గ్రూపులో సౌదీ అరేబియా, మెక్సికో,పోలాండ్ జట్లు ఉన్నాయి. ఒక్కో గ్రూప్ నుంచి రెండు జట్లు రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంటాయి. అర్జెంటీనాకు మెక్సికో, పోలండ్ నుంచి గట్టి పోటీ ఎదురుకావచ్చు.
ఫిఫా ప్రపంచకప్ లో పాల్గొనే జట్లు
- గ్రూప్ ఏ: ఖతార్, ఈక్వెడార్, సెనెగల్, నెదర్లాండ్స్
- గ్రూప్ బీ: ఇంగ్లండ్, ఇరాన్, యూఎస్ ఏ, వేల్స్
- గ్రూప్ సి: అర్జెంటీనా, సౌదీ అరేబియా, మెక్సికో, పోలాండ్
- గ్రూప్ డి: ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, డెన్మార్క్, ట్యునీషియా
- గ్రూప్ ఈ: స్పెయిన్, కోస్టారికా, జర్మనీ, జపాన్
- గ్రూప్ ఎఫ్: బెల్జియం, కెనడా, మొరాకో, క్రొయేషియా
- గ్రూప్ జీ: బ్రెజిల్, సెర్బియా, స్విట్జర్లాండ్, కామెరూన్
- గ్రూప్ హెచ్: పోర్చుగల్, ఘనా, ఉరుగ్వే, రిపబ్లిక్ ఆఫ్ కొరియా