FIFA WC Qatar 2022: ఫిఫా ప్రపంచకప్‌ ఆరంభానికి ముందు అర్జెంటీనాకు వరుస షాకులు తగులుతున్నాయి. ఆ జట్టు ఇద్దరు స్ట్రైకర్లు నికోలస్‌ గొంజాలెజ్‌, జొవాక్విన్ కోరె మెగా టోర్నీకి దూరమయ్యారు. కీలక సమయంలో వారిద్దరూ గాయాల పాలయ్యారు.




గురువారం ట్రైనింగ్‌ సెషన్లో గొంజాలెజ్‌ గాయపడ్డాడు. అతడి కండరాల్లో చీలిక వచ్చింది. సాధారణంగా అతడు ఫియోరెంటినాకు ఆడుతుంటాడు. అతడి స్థానంలో అట్లెలికో మ్యాడ్రిడ్‌ ఫార్వర్డ్‌ ఏంజెల్‌ కోరెను జట్టులోకి తీసుకున్నామని అర్జెంటీనా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ తెలిపింది. ఓ ప్రత్యేకమైన గాయంతో జొవాక్విన్‌ కోరెను తొలగించామని వెల్లడించింది. మామూలు సమయంలో అతడు ఇంటర్‌ మిలన్‌కు ఆడుతుంటాడు. అతడి ప్లేస్‌లో అట్లాంటా యునైటెడ్‌ ఫార్వర్డ్‌ తియాగో అల్మాడాను తీసుకున్నారు. ప్రపంచకప్‌లో అర్జెంటీనాకు ప్రాతినిధ్యం వహిస్తున్న తొలి ఎంఎల్‌ఎస్‌ ఆటగాడిగా అతడు రికార్డు సృష్టించబోతున్నాడు. కాగా ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ వార్మప్‌ మ్యాచులో బుధవారం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌పై కోరె ఒక గోల్‌ స్కోర్‌ చేయడం గమనార్హం.


సెప్టెంబర్లో హొండురస్‌పై జరిగిన ఫ్రెండ్లీ మ్యాచులో అల్మాడా తన దేశం తరఫున అరంగేట్రం చేశాడు. గ్రూప్‌ సీ ఓపెనింగ్‌ మ్యాచులో సౌదీ అరేబియాతో అర్జెంటీనా తలపడనుంది. మంగళవారం ఈ మ్యాచ్‌ జరుగుతుంది. నాలుగు రోజుల తర్వాత మెక్సికోను ఢీకొంటుంది. ఇక చివరి గ్రూప్‌ మ్యాచును నవంబర్‌ 30న పోలాండ్‌తో తలపడుతుంది.