FIFA World Cup 2022:  ఫిఫా ప్రపంచకప్ లో ఆఖరి అంకానికి ఇంకా ఒక రోజే మిగిలి ఉంది. ఈరోజు మూడో స్థానం కోసం క్రొయేషియా- మొరాకో తలపడనున్నాయి. ఇంక రేపు టైటిల్ పోరులో అర్జెంటీనా- ఫ్రాన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే ఫైనల్ కు ముందు ఫ్రాన్స్ జట్టును అనారోగ్యం వెంటాడుతోంది. ఆ జట్టు ఆటగాళ్లు ఒకరి తర్వాత ఒకరు అస్వస్థతకు గురవుతున్నారు. ప్రస్తుతం నలుగురు ఫ్రెంచ్ ఆటగాళ్లు జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం.


ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనుంది. కప్పు కోసం ఫ్రాన్స్- అర్జెంటీనా జట్లు తలపడనున్నాయి. ఒకటి డిఫెండింగ్ ఛాంపియన్, ఇంకొకటి మాజీ ఛాంపియన్. కాబట్టి ఈ రెండు జట్ల మధ్య ట్రోఫీ కోసం రేపు రసవత్తర పోరు ఖాయం. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఫైనల్ ముంగిట ఫ్రాన్స్ జట్టులోని కీలక ఆటగాళ్లు అనారోగ్యం బారిన పడడం ఆ జట్టునే కాక అభిమానులను కంగారు పెడుతోంది. ఫ్రాన్స్ డిఫెండర్ రాఫెల్ వరాన్, ఇబ్రహీం కొనాటే జ్వరం కారణంగా ప్రాక్టీస్ లో పాల్గొనలేదని సమాచారం. 






అప్పటికి కోలుకుంటారు!


అలాగే మొరాకోతో జరిగిన సెమీఫైనల్ లో ఆ జట్టు దిగ్గజ ఆటగాళ్లు అడ్రియన్ రాబియోట్, దయోట్ ఉపమికానో కూడా అస్వస్థతతో ఆడలేదు. అయినప్పటికీ ఆఫ్రికన్ జట్టును ఓడించిన ఫ్రాన్స్ ఫైనల్ కు చేరుకుంది. అయితే వీరంతా ఫైనల్ కు అందుబాటులో ఉంటారో లేదో తెలియని పరిస్థితి. దీనిపై ఆ జట్టు ఆటగాడు రెండాల్ కోలో మువానీ మాట్లాడాడు. 'మా క్యాంపులో జ్వరం విస్తరిస్తోంది. అయితే అది అంత తీవ్రమైనది కాదు. అనారోగ్యంతో ఉన్న ఆటగాళ్లు ప్రస్తుతం వారి వారి గదుల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆదివారం ఫైనల్ మ్యాచ్ సమాయనికి వారంతా అందుబాటులో ఉంటారని ఆశిస్తున్నాం' అని చెప్పాడు.