FIFA WC 2022 Qatar:  ఫిఫా ప్రపంచకప్ 2022 చివరి అంకానికి చేరుకుంది. కప్పు విజేతను ఈ ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ నిర్ణయించబోతోంది. అద్భుతమైన ఆటతో ఫైనల్ చేరిన అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్లు ఫైనల్ లో కప్పు కోసం తలపడనున్నాయి. ఈ క్రమంలో ఫుట్ బాల్ అభిమానుల కళ్లన్నీ అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ పైనే ఉన్నాయి. ఈ టోర్నీలో సూపర్ ఫాంలో ఉన్న మెస్సీ తన జట్టును ఫైనల్ చేర్చాడు. ఇప్పటివరకు 5 గోల్స్ చేశాడు. ఫుట్ బాల్ ఆటలో ఎన్నో రికార్డులు, అవార్డులు, కప్పులు అందుకున్న ఈ స్టార్ ఆటగాడు..  ఈ ఫైనల్ మ్యాచే ప్రపంచకప్ లో తన ఆఖరి మ్యాచ్ అని ఇప్పటికే ప్రకటించాడు. దీంతో ఈసారి అర్జెంటీనా కప్ గెలవాలని అభిమానులందరూ కోరుకుంటున్నారు. 


అర్జెంటీనా ఫైనల్ చేరిన క్రమంలో భారతదేశానికి చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కు చెందిన అకౌంట్ పాస్ బుక్ ట్రెండింగ్ లో నిలిచింది. అర్జెంటీనా జట్టుకు, ఎస్బీఐ పాస్ బుక్ కు సంబంధం ఏంటి అనుకుంటున్నారా. అదేనండి రంగు. అవును రంగే. 






అర్జెంటీనా ఫుట్ బాల్ జట్టు జెర్సీ రంగు బ్లూ. బ్లూ రంగుపై వైట్ కలర్ లో నిలువుగా చెక్స్ ఉంటాయి. ఎస్బీఐ పాస్ బుక్ కూడా అదే రంగులో ఉంటుంది. బుక్ మధ్యలో వైట్ కలర్ లో అడ్డంగా గీత ఉంటుంది.  దీన్నే ఇప్పుడు ఫుట్ బాల్ అభిమానులు ముడిపెట్టి చూస్తున్నారు. భారత్ లోని ఫుట్ బాల్ ఫ్యాన్స్ ఆ పాస్ బుక్ ను షోషల్ మీడియాలో షేర్ చేస్తూ అర్జెంటీనా గెలవాలని కోరుకుంటున్నారు. #Win Argentina హాష్ టాగ్ ను దానికి జతచేశారు. ఆదివారం ఫైనల్ మ్యాచ్ ఉన్న నేపథ్యంలో ఇది ప్రస్తుతం వైరల్ అవుతోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అర్జెంటీనా గెలవాలని కోరుకుంటోంది అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 


మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ కూడా సూపర్ గేమ్ తో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ ఫైనల్ చేరింది. మరోసారి కప్ ను గెలవాలని అనుకుంటోంది.