FIFA World Cup 2022: ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ సెమీ ఫైనల్స్‌లో మొరాకో (Morocco) జట్టు ఫ్రాన్స్ (France) చేతిలో ఓటమిపాలైంది. దీంతో మొరాకో ఫ్యాన్స్ వీరంగం సృష్టించారు. తమ జట్టు ఓటమిని జీర్ణించుకోలేకపోయిన ఫ్యాన్స్.. ఆగ్రహంతో బ్రస్సెల్స్ వీధుల్లో రచ్చరచ్చ చేశారు.






పోలీసులపై


మొరాకో జెండాలు చేతపట్టుకన్న సుమారు వంద మంది.. బ్రసెల్స్‌లోని సౌత్‌ స్టేషన్‌ సమీపంలో చెత్త డబ్బాలు, కార్డ్‌బోర్డులను తగలబెట్టారు. పోలీసులపైకి పటాకులు, వస్తువులు విసిరేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. పరిస్థితులు దిగజారిపోకుండా ఉండేందుకు బాష్పవాయువు ప్రయోగించారు. వాటర్‌ క్యానన్లతో అభిమానులను చెదరగొట్టారు. మొరాకో ఫ్యాన్స్ చేసిన ఆందోళన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.










ఓటమి


బుధవారం రాత్రి జరిగిన సెమీఫైనల్‌లో మొరాకోపై 2-0 తేడాతో ఫ్రాన్స్‌ విజయం సాధించింది. ఆధ్యంతం హోరాహోరాగా సాగిన మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ జట్టులోని ఆటగాళ్లు.. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. దీంతో మొరాకో ఒక్కగోలు కూడా చేయకుండానే మ్యాచ్‌ను ముగించాల్సి వచ్చింది.


ఆఫ్రికా జట్టు మొరాకో ఎలాంటి అంచనాలు లేకుండా ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో అడుగుపెట్టింది. కానీ హేమాహేమీలను ఓడించి సెమీఫైనల్‌ వరకు దూసుకొచ్చింది. అయితే బుధవారం జరిగిన సెమీస్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఫ్రాన్స్‌ చేతిలో మట్టికరిచింది. దీంతో తమ జట్టు ఫైనల్‌కు చేరి కప్పు కొడుతుందనుకున్న మొరాకో అభిమానుల ఆశలు చెదిరిపోయాయి. ఫ్రాన్స్‌ చేతిలో ఓడిపోవడంతో ఆ జట్టు అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


Also Read: రైళ్లలో వృద్ధులకు రాయితీ ఇవ్వలేం- తేల్చి చెప్పిన రైల్వే శాఖ మంత్రి