Ashwini Vaishnav: వృద్ధులకు రైల్వే టికెట్ పై రాయితీ ఇవ్వడం కుదరదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ (Ashwini Vaishnav) తేల్చి చెప్పారు ఇందుకు కారణం సబ్సిడీ కారణంగా ప్రభుత్వంపై ప్రతి ఏటా రూ. 59 వేల కోట్ల భారం పడుతుందని వివరించారు.


అయితే అదే కేంద్ర ప్రభుత్వం బడా బాబులకు లక్షల కోట్ల రుణాలను మాఫీ చేస్తుందని.. గత ఐదేళ్లలో రూ.10 వేట కోట్ల రుణాలను రైటాఫ్ చేసిందని బుధవారం లోక్ సభలో మహారాష్ట్ర ఎంపీ నవ్ నీత్ రాణా అన్నారు. రెండేళ్లలోనే కార్పొరేట్ కంపెనీలకు 1.84 లక్షల కోట్ల రూపాయల లబ్ధిని చేకూర్చిందని.. మరి రైళ్లలో వృద్ధులకు రాయితీని ఎప్పుడు పునరుద్ధరిస్తారని అడిగారు. దీనిపై స్పందించిన రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్.. రైలు టికెట్ల ధరలపై వృద్ధులకు రాయితీ ఇవ్వలేమని, సబ్సిడీ వల్ల రూ.59 వేల కోట్ల భారం ప్రభుత్వంపై పడిందని తెలిపారు. ఇది కొన్ని రాష్ట్రాల వార్షిక బడ్జెట్ కన్నా ఎక్కన అని వివరించారు. 


41 మేజర్ రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నాం..


ఏటా పింఛన్ల బిల్లు 60 వేల కోట్ల రూపాయలు అవుతుండగా.. జీతాల బిల్లు 97 వేల కోట్ల రూపాయలు అని, అలాగే ఇంధనం బిల్లు రూ.40 వేల కోట్లు అవుతుందని అశ్వనీ వైష్ణవ్ చెప్పుకొచ్చారు. ఇంత ఖర్చులు అవుతుండగా.. మళ్లీ సబ్సిడీ ఇవ్వలేమని, అది చాలా కష్టం అని పేర్కొన్నారు. ఒక వేళ కొత్త సదుపాయాలు వస్తే.. వాటిపై నిర్ణయం తీసుకుంటామని, ఇప్పటికి అయితే రైల్వే శాఖ పరిస్థితిని అర్థం చేసుకోవాలని అన్నారు. మరో ప్రశ్నకు సమాధానంగా... 41 మేజర్ రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని, మిగతా రైల్వే స్టేషన్లను దశల వారీగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం వందే భారత్ రైళ్లు 500 నుంచి 550 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తున్నాం అని, స్లీపింగ్ సదుపాయాలు అందుబాటులోకి వస్తే మరింత దూరం ప్రయాణించేలా తీర్చిదిద్దుతామని చెప్పారు. 2030 నాటికి రైల్వే శాఖను కాలుష్య రహితంగా మార్చేలా లక్ష్యం పెట్టుకోవాలని అన్నారు. 


విద్యార్థుల స్కాలర్ షిప్ లను కూడా రద్దు చేసిన ప్రభుత్వం..


అలాగే విద్యార్థుల స్కాలర్ షిప్, ఫెలో షిప్ లను కూడా కేంద్రం ఒక్కొక్కటిగా ఎత్తి వేస్తోంది. జాతీయ అర్హత పరీక్ష(నెట్) కాకుండా, వర్సిటీలు నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా ఎంఫిల్, పీహెచ్ డీ సీట్లలో చేరే విద్యార్థులకు యూజీసీ ద్వారా ఫెలోషిప్ లను కేంద్రం రద్దు చేసింది. దీంతో పరిశోధనల కోసం ప్రతీ నెలా అందే రూ.25 వేల మొత్తానికి విద్యార్థులు దూరం అయ్యారు. మైనారిటీ విద్యార్థులకు ఇచ్చే మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ ను కూడా రద్దు చేసింది. 400 వరకు ఉన్న సబ్సిడీని ఎత్తి వేసింది. ఉజ్వల పథకం కింద పేదలకు ఇస్తున్న ఉచిత సిలిండర్ల పథకానికి 95 శాతం నిధులను తగ్గించింది.