ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకుంది. రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో విజయం సాధించింది. తన కెరీర్‌లో మెస్సీ ఆడిన 1000వ మ్యాచ్ ఇది కావడం విశేషం. 1000 మ్యాచ్‌ల్లో 789 గోల్స్‌ను మెస్సీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో కూడా మెస్సీ ఒక గోల్ కొట్టాడు. ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో మెస్సీకి ఇదే తొలి గోల్. 


ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా తరఫున మెస్సీ, జులియన్ అల్వారెజ్ గోల్స్ సాధించగా, అర్జెంటీనా ఆటగాడైన ఎంజో ఫెర్నాండెజ్ సెల్ఫ్ గోల్ చేయడంతో ఆధిక్యం 2-1కు తగ్గింది. ఆట మొదటి సగంలో ఆస్ట్రేలియా డిఫెన్స్‌ను ఛేదిస్తూ మెస్సీ కొట్టిన గోల్ మ్యాచ్‌కే హైలెట్.


అర్జెంటీనా తన మొదటి మ్యాచ్‌లో సౌదీ అరేబియా నుంచి ఓడిపోవడంతో టోర్నమెంట్ నుంచి నిష్క్రమించే ప్రమాదంలో పడింది. కానీ ఆ తర్వాత వెంటనే తేరుకుని జాగ్రత్తగా ఆడటంతో నాకౌట్ దశకు చేరుకుంది. రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో కూడా జాగ్రత్తగా ఆడి విజయం సాధించింది.


అర్జెంటీనా తన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తలపడనుంది. నెదర్లాండ్స్ కూడా తన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో 3-1 తేడాతో యూఎస్‌ఏపై విజయం సాధించింది. ఈ రెండు జట్ల మధ్య క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ డిసెంబర్ 10వ తేదీన జరగనుంది.