ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో పెను సంచలనం నమోదైంది. ఫిఫా ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న బెల్జియం టోర్నమెంట్ నుంచి లీగ్ దశలోనే నిష్క్రమించింది. అయితే బెల్జియంను ఓడించిన క్రొయేషియా కూడా చిన్న జట్టేమీ కాదు. 2018 ప్రపంచకప్‌లో క్రొయేషియా రన్నరప్‌గా నిలిచింది.


ఆట రెండో భాగంలో బెల్జియం తీసుకొచ్చిన స్టార్ ప్లేయర్ రొమెలు లుకాకు సొంత జట్టు కొంపముంచాడు. అతను సులువైన అవకాశాలు జారవిడచడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. గ్రూప్-ఎఫ్ నుంచి మొరాకో ఇప్పటికే నాకౌట్‌కు చేరుకోగా, ఈ మ్యాచ్ డ్రా కావడంతో క్రొయేషియా రెండో స్థానంలో నిలిచి రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంది. బెల్జియం మాత్రం టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.


1998 తర్వాత ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో బెల్జియం నాకౌట్ దశకు చేరుకోకుండా వెనుదిరగడం ఇదే తొలిసారి. ఈ టోర్నమెంట్‌లో బెల్జియం కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. తన మొదటి మ్యాచ్‌లో కెనడాపై 1-0తో గెలిచింది.


ఈ మ్యాచ్ ప్రారంభం అయిన 10 సెకన్లలోనే క్రొయేషియా దాదాపు గోల్ కొట్టినంత పని చేసింది. కానీ బెల్జియం డిఫెన్స్ దాన్ని అద్భుతంగా అడ్డుకున్నారు. నాకౌట్ దశకు వెళ్లాలంటే క్రొయేషియా డ్రా చేసుకుంటే సరిపోతుంది, బెల్జియం మాత్రం గెలిచి తీరాలి. ఈ విషయాన్ని మైండ్‌లో పెట్టుకున్న క్రొయేషియా డిఫెన్సివ్ గేమ్‌తోనే బరిలోకి దిగింది. గోల్ చేయాలన్న బెల్జియం ప్రయత్నాలను తిప్పి కొట్టింది.


ఆట రెండో భాగంలో స్టార్ ప్లేయర్ రొమెలు లుకాకును తీసుకు రావడం వారు చేసిన పెద్ద తప్పు అయింది. ఏకంగా మూడు గోల్ కొట్టే అవకాశాలను లుకాకు వృథా చేశాడు. బెల్జియం తరఫున అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాడు లుకాకు. 101 గేమ్‌ల్లో ఏకంగా 68 గోల్స్‌ను లుకాకు సాధించాడు. కానీ కీలకమైన మ్యాచ్‌లో చేతులు ఎత్తేయడం బెల్జియం కొంప ముంచింది.