FIFA WC 2022 Qatar: ఫిఫా ప్రపంచకప్ 2022 సంచలనాలకు వేదికగా మారింది. ఇప్పటికే కొన్ని చిన్న జట్లు పెద్ద జట్లకు షాకిచ్చాయి. ఇప్పుడు గ్రూప్ దశ చివర్లో మరో చిన్న జట్లు మాజీ ఛాంపియన్ కు షాకిచ్చింది. బుధవారం జరిగిన మ్యాచులో పసికూన ట్యునిషియా జట్టు... ఫ్రాన్స్ ను 1-0తో ఓడించింది. అయితే ఇప్పటికే రెండు విజయాలు సాధించిన ఫ్రాన్స్... ఈ మ్యాచు ఓడినప్పటికీ నాకౌట్ కు చేరుకుంది. మెగా టోర్నీ నుంచి నిష్క్రమించినా ఈ విజయం ట్యునిషియాకు చిరస్మరణీయంగా మిగిలింది.
బుధవారం ఉత్కంఠభరితంగా జరిగిన గ్రూప్- డి మ్యాచులో పసికూన ట్యునిషియా- డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ ను ఓడించింది. అయినప్పటికీ ఆ జట్టు రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించలేదు. అయితేనేం ఓ చిరస్మరణీయ విజయంతో మెగా టోర్నీ ప్రయాణాన్ని ముగించింది. ట్యునిషియాతో పోలిస్తే ఫ్రాన్స్ ఎక్కువశాతం బంతిని తన అధీనంలోనే ఉంచుకుంది. అలాగే ఫ్రాన్స్ ఆటగాళ్లు ఎక్కువ పాస్ లు అందిపుచ్చుకున్నారు. అయినప్పటికీ గోల్ కొట్టడంలో విఫలమయ్యారు. ప్రథమార్ధంలో ఫ్రాన్స్ స్పష్టమైన పైచేయి సాధించినా.. ఆ జట్టు గోల్ కొట్టకుండా ట్యునీషియా రక్షణ శ్రేణి సమర్థంగా అడ్డుకుంది.
ద్వితీయార్ధంలో కొంచెం దూకుడుగా కదిలిన ట్యునీషియా ఆటగాళ్లు 58వ నిమిషంలో మంచి అవకాశం సృష్టించుకున్నారు. లైదౌని తెలివిగా బంతిని చేజిక్కించుకుని ఖజ్రికి పాస్ అందించగా.. అతను ఇద్దరు ఫ్రాన్స్ డిఫెండర్లతో పాటు గోల్ కీపర్ మందండాను బోల్తా కొట్టించి గోల్ కొట్టటంతో ఆ జట్టు సంబరాలకు అంతే లేకుండా పోయింది. ఆ తర్వాత ఫ్రాన్స్ ఆటగాళ్లు గోల్ కొట్టకుండా ట్యునిషియా నిలవరించగలిగింది. మ్యాచు ముగిసే సమయానికి 1-0 ఆధిక్యంలో ఉన్న ట్యునిషియా విజయం సాధించింది. నాకౌట్ చేరనప్పటికీ పటిష్టమైన ఫ్రాన్స్ ను ఓడించటంతో ఆ జట్టు అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.
ఆఖర్లో ఫ్రాన్స్ గోల్... అయినా
నిర్ణీత సమయం 90 నిమిషాలు పూర్తయి, ఇంజురీ టైం మొదలయ్యాక ఇంకో నిమిషం ఆటే మిగిలుండగా.. ఫ్రాన్స్ స్టార్ గ్రీజ్‌మన్ ట్యునీషియా బాక్స్‌లో బంతి అందుకుని మెరుపు షాట్‌తో నెట్‌లోకి పంపించేశాడు. దీంతో ట్యునీషియా ఆటగాళ్లు, అభిమానులు షాక్‌లోకి వెళ్లిపోయారు. కానీ రిఫరీ రీప్లే కోరగా.. అది ఆఫ్‌సైడ్ అని తేలడంతో ఫ్రాన్స్ ఖాతాలో గోల్ చేరలేదు. మ్యాచ్ ట్యునీషియా సొంతమైంది.