FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచకప్ నకు ఆతిథ్యమిస్తున్న ఖతార్ ఒక చెత్త రికార్డును మూటగట్టుకుంది. వరల్డ్ కప్ చరిత్రలో ఒక్క మ్యాచ్ గెలవకుండా, ఒక్క పాయింట్ కూడా సాధించని ఆతిథ్య దేశంగా ఇబ్బందికర రికార్డును అందుకుంది. గ్రూప్- ఏ లో ఖతార్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓడిపోయింది. దాంతో పాయింట్ల ఖాతా తెరవకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది.
మూడు మ్యాచుల్లోనూ ఓటమి
ఫిఫా ప్రపంచకప్ నకు ఈ ఏడాది ఖతార్ ఆతిథ్యమిచ్చింది. ప్రపంచంలో 50వ ర్యాంకులో ఉన్న ఖతార్ ఆతిథ్య దేశంగా టోర్నీలో పాల్గొంది. అయితే గ్రూపు మ్యాచుల్లో ఈక్వెడార్, నెదర్లాండ్స్, సెనెగల్ జట్ల చేతుల్లో ఓడిపోయి ఒక్క పాయింట్ కూడా సాధించకుండానే అవమానకర రీతిలో మెగా టోర్నీ నుంచి వెళ్లిపోయింది. ఆడిన 3 మ్యాచుల్లో ఒక్క గోల్ మాత్రమే కొట్టింది. అలాగే ఆడిన మొదటి మ్యాచులో ఓడిన ఆతిథ్య దేశంగా కూడా ఇంకో ఇబ్బందికర రికార్డును నెలకొల్పింది.
ఇప్పటివరకు ఖతార్ కు ముందు ఒక్కసారి మాత్రమే ఆతిథ్య దేశం నాకౌట్ కు చేరుకోవడంలో విఫలమైంది. 2010 లో ప్రపంచకప్ నకు ఆతిథ్యమిచ్చిన దక్షిణాఫ్రికా మొదటి రౌండ్ లోనే ఇంటిముఖం పట్టింది. అయితే చివరి గ్రూప్ మ్యాచ్ వరకు సౌతాఫ్రికా పోటీలో ఉంది. ప్రస్తుతం గ్రూప్ ఏ నుంచి నెదర్లాండ్స్, సెనెగల్ రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించాయి. అగ్రస్థానంలో నెదర్లాండ్స్, రెండో స్థానంలో నిలిచి సెనెగల్ నాకౌట్ దశకు చేరుకున్నాయి.
ఖతార్ పై నెదర్లాండ్స్ విజయం
ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్ లో నిన్న జరిగిన మ్యాచ్ లో ఖతార్ పై నెదర్లాండ్స్ విజయం సాధించింది. తన చివరి లీగ్ మ్యాచులో ఆతిథ్య ఖతార్ ను 2-0తో ఓడించింది. దీంతో గ్రూపులో అగ్రస్థానంతో రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. అలాగే ఈక్వెడార్ ను మట్టికరిపించిన సెనెగల్ రెండో స్థానంతో నాకౌట్ కు చేరింది.
ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో మూడుసార్లు రన్నరప్ నెదర్లాండ్స్ ఈసారి గ్రూప్ దశలో అంత గొప్ప ప్రదర్శన చేయలేదు. అయినా కూడా సులువుగానే నాకౌట్ చేరింది. తన కంటే బలహీనమైన మూడు జట్లపై ఓటమి లేకుండా గ్రూప్ దశను ముగించిన నెదర్లాండ్స్ అగ్రస్థానంతో ముందంజ వేసింది. సెనెగల్‌ను ఓడించి, ఈక్వెడార్‌తో డ్రాతో సరిపెట్టుకున్న ఈ జట్టు.. మంగళవారం ఆతిథ్య ఖతార్‌ను 2-0తో ఓడించింది.