FIFA World Cup 2022:  ఫిఫా ప్రపంచకప్ లో నిన్న ఇంగ్లండ్- ఇరాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచులో ఒక చర్చనీయాంశమైన ఘటన జరిగింది. ఇరాన్ ఆటగాళ్లు తమ జాతీయ గీతాన్ని పాడడానికి నిరాకరించారు. ఎందుకంటే...


ఆట మొదలు పెట్టేటప్పుడు ఇరు దేశాల జాతీయ గీతాలను పాడడం ఆనవాయితీ. అలాగే నిన్న ఇంగ్లండ్- ఇరాన్ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఇరాన్ జాతీయ గీతాన్ని వినిపించారు. అయితే ఆ జట్టు ఆటగాళ్లు మాత్రం తమ నేషనల్ ఆంథమ్ ను ఆలపించలేదు. నిశ్చలంగా నిలబడిపోయారు. స్వదేశానికి తిరిగివచ్చిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు మద్దతుగా వారు జాతీయ గీతాన్ని పాడలేదు.


దీనిపై ఇరాన్ కెప్టెన్ అలీరెజా జహన్ బక్ష్ మాట్లాడుతూ.. 'మా దేశంలోని ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు స్పష్టమైన మద్దతుగా మేం జాతీయ గీతాన్ని ఆలపించలేదు. ఇరాన్ లో పాలనను కదిలించిన ప్రదర్శనలకు సంఘీభావంగా గీతం పాడాలా వద్దా అనేది జట్టు మొత్తం కలిసి నిర్ణయం తీసుకుంది.' అని చెప్పాడు. 


ఎందుకీ నిరసనలు


ఇరాన్ లో హిజాబ్ ధరించలేదన్న కారణంతో 22 ఏళ్ల మహ్సా అమినీ అనే యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె మూడు రోజుల తర్వాత పోలీస్ కస్టడీలో మరణించింది. దీనికి వ్యతిరేకంగా ఆ దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. దాదాపు రెండు నెలలుగా అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంతమంది ప్రదర్శనలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వ అణచివేతలో దాదాపు 400 మందికి పైగా నిరసనకారులు చనిపోయారు.  వారికి మద్దతుగానే ఇప్పుడు ప్రపంచకప్ లో ఇరాన్ జాతీయ గీతాన్ని ఆలపించలేదు. 


గత వారం బ్రిటీష్ జర్నలిస్ట్ ఒకరు దీనిపై కెప్టెన్ అలీరెజాను ప్రశ్నించారు. దీనికి అలీ స్పందిస్తూ.. "ప్రతి ఒక్క ఆటగాడు వేర్వేరు అభిప్రాయాలను కలిగి ఉంటాడు. అయితే జాతీయ గీతం పాడాలా వద్దా అనేది జట్టు అందరూ కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం. కాబట్టి నిజాయతీగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఫుట్ బాల్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు.' అని చెప్పాడు. 


కాగా, నిన్న ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచులో ఇరాన్ 2-6 తేడాతో ఓడిపోయింది.