శనివారం ఖతార్‌లో జరిగిన ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్‌లో మొరాకోతో 0-1తో షాక్‌తో ఓటమి పాలైన తర్వాత పోర్చుగీస్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో వైరల్ అయిన తన ఫొటోలపై స్పందించాడు. రొనాల్డో తన చివరి ప్రపంచ కప్ ప్రదర్శన తర్వాత మైదానంలో అసహనంగా ఏడుస్తూ కనిపించాడు. పోర్చుగీస్ స్టార్ ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేశాడు. ప్రపంచ కప్ గెలవడం తన "పెద్ద కల" అని చెప్పాడు.
"పోర్చుగల్ కోసం ప్రపంచ కప్ గెలవడం నా కెరీర్‌లో అతిపెద్ద, అత్యంత ప్రతిష్టాత్మకమైన కల. అదృష్టవశాత్తూ నేను పోర్చుగల్ తరఫున అనేక అంతర్జాతీయ స్థాయి టైటిల్‌లను గెలుచుకున్నాను. కానీ మన దేశం పేరును ప్రపంచంలోనే అత్యున్నత పీఠంపై ఉంచడం నా అతిపెద్ద కల." అని పేర్కొన్నాడు.
"నేను దాని కోసం పోరాడాను. ఈ కల కోసం నేను తీవ్రంగా పోరాడాను. 16 ఏళ్లలో ప్రపంచ కప్‌లలో నేను చేసిన ఐదు ప్రదర్శనలలో 100 శాతం ప్రదర్శన అందించాను. ఆ కలను నేను ఎప్పుడూ వదులుకోలేదు," అని అందులో తెలిపాడు. ఇదే తన చివరి ప్రపంచకప్ ప్రదర్శన కావచ్చని సూచిస్తూ తన కల ముగిసిందని చెప్పాడు.
"దురదృష్టవశాత్తూ నిన్నటి కల ముగిసింది. దీనికి ప్రతిస్పందించడం విలువైనది కాదు. కానీ పోర్చుగల్ పట్ల నా అంకితభావం ఒక్క క్షణం కూడా మారలేదు. నేను ఎప్పుడూ అందరి లక్ష్యం కోసం పోరాడేవాడిని. నేను నా సహచరులకు, నా దేశానికి ఎప్పటికీ వెన్ను చూపను." అన్నాడు. అలాగే పోర్చుగల్‌కు ధన్యవాదాలు తెలిపాడు. దీన్ని బట్టి రొనాల్డో రిటైర్మెంట్ యోచనలో ఉన్నాడని అనుకోవచ్చు.