Sofiane Boufal Celebration: ఫిఫా ప్రపంచకప్ లో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో పోర్చుగల్ ను ఓడించి మొరాకో జట్టు సంచలనం సృష్టించింది. ఈ విజయంతో సెమీఫైనల్ కు చేరుకుంది. ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో సెమీ ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి ఆఫ్రికన్ జట్టుగా మొరాకో నిలిచింది. ఈ గెలుపుతో ఆటగాళ్లే కాదు అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఆటగాళ్లయితే ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు. మొరాకో మిడ్ ఫీల్డర్ సోఫియానో బౌఫాల్ తన తల్లితో కలిసి మైదానంలో డ్యాన్స్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. 


మొరాకో జట్టు విజయం సాధించిన తర్వాత ఆ జట్టు ఆటగాడు సోఫియానో బౌఫాల్ తల్లి మైదానంలోకి వచ్చారు. తన కొడుకుని పట్టుకుని సంతోషంతో డ్యాన్స్ చేశారు. వారిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తూ అభిమానులను అలరించారు. తమ దేశ జట్టు ఫిఫా ప్రపంచకప్ సెమీఫైనల్ కు చేరుకుందన్న సంతోషం బౌఫాల్ తల్లి కళ్లల్లో కనిపించింది. వీరిద్దరినూ చూసి ఫ్యాన్స్ సంతోషించారు. 






మొరాకో విజయం.. చెదిరిన రొనాల్డో కల


ఫిఫా వరల్డ్ కప్ 2022లో మొరాకో జట్టు సంచలన విజయం నమోదు చేసింది. ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో సెమీ ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి ఆఫ్రికన్ జట్టుగా మొరాకో నిలిచింది. దోహాలో శనివారం రాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 1-0 గోల్స్  తేడాతో పోర్చుగల్ పై మొరాకో గెలిచి, సగర్వంగా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్-ఫైనల్‌కు చేరుకున్న మూడు ఆఫ్రికన్ జట్లుగా 1990లో కామెరూన్, 2002లో సెనెగల్, 2010లో ఘనా నిలిచాయి. తాజా విజయంతో సెమీఫైనల్ చేరిన తొలి ఆఫ్రికా జట్టుగా మొరాకో నిలిచి వరల్డ్ కప్ రేసులో మరో అడుగు ముందుకేసింది. 


ఆట 42వ నిమిషంలో మొరాకో ఆటగాడు యూసెఫ్ యెన్ నెస్రి గోల్ కొట్టి 1-0తో ఆఫ్రికా జట్టును ఆధిక్యంలోకి తెచ్చాడు. ఎడమ వైపు నుంచి టీట్ మేట్ తనకు అందించిన పాస్ ను గోల్ గా మలిచాడు యూసెఫ్ యెన్ నెస్రి. కానీ పోర్చుగల్ గోల్ ఖాతా తెరవడంలో విఫలం కావడంతో నిరాశగా వెనుదిరిగింది.  పోర్చుగల్ కు ఫిఫా వరల్డ్ కప్ అందించాలన్న కల నెరవేరకుండానే స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో మరోసారి ఇంటి బాట పట్టాడు. పోర్చుగల్ ఓటమిని జీర్ణించుకోలేని రొనాల్డో కన్నీటిపర్యంతమయ్యాడు. కెరీర్‌లో చివరి ఫుట్ బాల్ వరల్డ్ కప్ ఆడేసినట్లేనని అభిమానులు అంటున్నారు.