Croatia win against Brazil: ఫిఫా ప్రపంచ కప్ 2022లో మరో సంచలనం నమోదైంది. 5 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన బ్రెజిల్‌ ఇంటి దారి పట్టింది క్రొయేషియా. ఈ సారి ఎలాగైనా కప్ కొట్టాలన్న కసితో బరిలోకి దిగిన క్రియేషియా మాజీ ఛాంపియన్ బ్రెజిల్‌ను నిలువరించింది. క్వార్టర్ ఫైనల్లో బ్రెజిల్ పై సంచలన విజయం నమోదు చేసిన క్రొయేషియా ఫిపా వరల్డ్ కప్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. నిర్ణీత సమయంలో ఏ జట్టూ గోల్ చేయలేకపోయింది, అదనపు సమయం కేటాయించిన తరువాత 1-1 తో స్కోర్ సమం కావడంతో పెనాల్టీ షూటౌట్‌కు వెళ్లింది. పెనాల్టీ షూటౌట్ లో 4-2 గోల్స్ తేడాతో బ్రెజిల్ ను ఇంటిదారి పట్టిస్తూ క్రొయేషియా సంచలన విజయం సాధించింది. 


ఎడ్యుకేషన్ సిటీ స్టేడియంలో జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో క్రొయేషియా, బ్రెజిల్ పట్టుదలతో ఆడాయి. మ్యాచ్ పూర్తి సమయం ముగిసేసరికి ఏ జట్టు కూడా గోల్ చేయలేకపోయింది. అయితే అదనపు సమయంలో మాత్రం మొదట మాజీ ఛాంపియన్ బ్రెజిల్ ఖాతా తెరిచింది. స్టార్ ప్లేయర్ నెయ్‌మర్ 106వ నిమిషంలో గోల్ చేశాడు. దాంతో బ్రెజిల్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన దిగ్గజం పీలే రికార్డును సమం చేశాడు నెమ్‌మర్. నెమ్‌మర్ 77 అంతర్జాతీయ గోల్స్ తో బ్రెజిల్ కే చెందిన దిగ్గజం పీలే రికార్డును చేరుకున్నాడు. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. క్రొయేషియా ఆటగాడు బ్రూన్ పెట్కోవిక్ 116వ నిమిషంలో గోల్ కొట్టి స్కోర్ 1-1 సమం చేసి జట్టు ఆశల్ని సజీవంగా నిలిపాడు.






పెనాల్టీ షూటౌట్ సాగిందిలా..
ఇరు జట్లు అదనపు సమయంలోనూ 1-1 తో స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ విజేతను తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్‌కు వెళ్లింది. మొదట క్రొయేషియా ఆటగాడు తన కిక్‌తో బ్రెజిల్ గోల్ కీపర్ ను బోల్తా కొట్టింది గోల్ సాధించాడు. బ్రెజిల్ ఆటగాడు కొట్టిన కిక్ ను క్రొయేషియా కీపర్ అద్భుతంగా నిలువరించాడు.






రెండో ప్రయత్నంలోనూ క్రొయేషియా ఆటగాడు బంతిని గోల్ పోస్ట్ లోకి పంపించగా, ఈసారి బ్రెజిల్ ఆటగాడు గోల్ కొట్టడంతో స్కోర్ 2-1 అయింది. 
మూడో ప్రయత్నంలోనూ క్రొయేషియా ఆటగాడు గోల్ కొట్టగా, బ్రెజిల్ ప్లేయర్ సైతం గోల్ సాధించడంతో స్కోరు 3 -2 అయింది.
నాలుగో ప్రయత్నంలోనూ క్రొయేషియా ఆటగాడు సక్సెస్ అయ్యాడు. కానీ బ్రెజిల్ ఆటగాడు బంతిని గోల్ పోస్ట్ లోకి పంపడంలో విఫలం కావడంతో క్రొయేషియా జట్టు క్వార్టర్ ఫైనల్లో పెనాల్టీ షూటౌట్‌లో 4-2 గోల్స్ తేడాతో మాజీ ఛాంపియన్ బ్రెజిల్‌పై సంచలన విజయం సాధించి ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. బ్రెజిల్ ఆటగాళ్లు కన్నీటి పర్యంతం కాగా, విజయాన్ని ఆస్వాదిస్తూ తోటి ఆటగాళ్లతో ఆనందాన్ని పంచుకోవడం క్రొయేషియా ఆటగాళ్ల వంతయింది.


క్రొయేషియా 1998లో మూడో స్థానంలో, 2018 వరల్డ్ కప్ లో రన్నరప్‌గా నిలిచింది. గత ఏడాది ఫామ్‌ను కొనసాగిస్తూ ఈ ఏడాది తుది 4 జట్లలో చోటు దక్కించుకుంది ఆ జట్టు. ఫిపా వరల్డ్ కప్ లో ఇప్పటివరకూ బ్రెజిల్‌తో నాలుసార్లు తలపడగా 3 మ్యాచ్‌లలో ఓడిన క్రొయేషియా ఓ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. తమ 5వ ప్రయత్నంలో మాజీ ఛాంపియన్ బ్రెజిల్‌పై వరల్డ్ కప్‌లో తొలిసారిగా విజయం సాదించింది. దాంతో సెమీఫైనల్లోకి దర్జాగా ప్రవేశించింది ఈ దక్షిణ అమెరికా జట్టు.