FIFA World Cup 2022 Qatar: స్పెయిన్ ఫుట్ బాల్ కోచ్ లూయిస్ ఎన్రిక్ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఫిఫా ప్రపంచకప్ లో ఆ జట్టు ప్రీ క్వార్టర్స్ లో మొరాకో చేతిలో ఓడిన తర్వాత రెండు రోజులకే ఆయన కోచ్ గా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. 


రియల్ మాడ్రిడ్, బార్సిలోనాకు చెందిన లూయిస్ 2018 నుంచి స్పెయిన్ ఫుట్ బాల్ కోచ్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతేడాది తన జట్టును యూరో ప్రపంచకప్ లో సెమీ ఫైనల్ కు చేర్చారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఖతార్ ప్రపంచకప్ లో స్పెయిన్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. 2010లో స్పెయిన్ ఫిఫా కప్ నెగ్గింది. ఈసారి కనీసం క్వార్టర్స్ కు చేరలేకపోయింది.


ఫిఫా ప్రపంచకప్ లో స్పెయిన్ తన ఆరంభ మ్యాచులో కోస్టారికాను 7-0 తో ఓడించింది. దీంతో ఆ జట్టు అభిమానులు ఈసారి కప్ స్పెయిన్ దే అన్నట్లు సంబరపడ్డారు. అందుకు తగ్గట్లే గ్రూపు దశలో తర్వాతి మ్యాచుల్లో జర్మనీతో 1-1తో డ్రా చేసుకున్న స్పెయిన్.. జపాన్ చేతిలో 2-1తో ఓడిపోయింది.  రెండో స్థానంతో ప్రీ క్వార్టర్స్ కు చేరుకుంది. 


అయితే రౌండ్ ఆఫ్ 16లో మొరాకో చేతిలో ఓడిపోయి ఇంటి ముఖం పట్టింది. ఆ మ్యాచులో పెనాల్టీ షూటౌట్ లో 3-0 తేడాతో ఓడిపోయింది. షూటౌట్ లో పాబ్లో సరాబియా, కార్లోస్ సోలెర్, సెర్గియో బుస్కెట్స్ లు గోల్స్ కొట్టడంలో విఫలమయ్యారు. ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ స్పానిష్ కోచ్ లూయిస్ ఎన్రిక్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. 






ఇప్పటివరకు ఫిఫా ప్రపంచకప్


FIFA ప్రపంచ కప్ 2022 ఇప్పటివరకు చాలా ఉత్కంఠభరితంగా ఉంది. ఈ ప్రపంచకప్‌లో ఎన్నో పెద్ద సంచలనాలు నమోదయ్యాయి. బెల్జియం వంటి అగ్రశ్రేణి జట్లు నాకౌట్‌కు చేరుకోలేకపోయాయి. ఇది కాకుండా అనేక చిన్న జట్లు గ్రూప్ దశలో పెద్ద జట్లకు షాక్ ఇచ్చాయి. అయితే మొత్తం 32 జట్లలో ఎనిమిది జట్లు క్వార్టర్ ఫైనల్స్‌లో చోటు దక్కించుకున్నాయి. ఇందులో నెదర్లాండ్స్, అర్జెంటీనా, క్రొయేషియా, బ్రెజిల్, ఇంగ్లండ్, ఫ్రాన్స్, మొరాకో, పోర్చుగల్ జట్లు ఉన్నాయి. ఈ జట్లు సెమీ ఫైనల్‌కు చేరుకోవడానికి ఒకదానితో ఒకటి ఢీకొంటాయి.


ఈ జట్లు సెమీ ఫైనల్స్‌ కోసం తలపడనున్నాయి


క్వార్టర్ ఫైనల్స్‌లో భాగంగా శుక్రవారం డిసెంబర్ 9వ తేదీన బ్రెజిల్, క్రొయేషియా జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 8:30 గంటలకు జరుగుతుంది. ఎడ్యుకేషన్ సిటీ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక కానుంది. ఈ మ్యాచ్‌లో బ్రెజిల్ ఫేవరెట్‌గా ఉంది.