FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచకప్ 2022 ఎడిషన్ ప్రస్తుతం క్వార్టర్స్ దశలో ఉంది. ఖతార్ లో జరుగుతున్న ఈ మెగా టోర్నీ ప్రేక్షకులను, అభిమానులను విపరీతంగా అలరిస్తోంది. మైదానాలు ప్రేక్షకులతో నిండిపోతున్నాయి. దానికి తగ్గట్లే గ్రూపు దశలోనూ, ప్రీ క్వార్టర్స్ లోనూ పలు సంచలనాలు నమోదయ్యాయి.క్రీడాకారులు తమ ఆటతీరుతో చూసేవారిని మెప్పిస్తున్నారు.
ఇండియా నెం. 2
భారత్ ఫిఫా ప్రపంచకప్ లో ఆడడంలేదు. అయితేనేం ఇండియాలో ఫుట్ బాల్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ ఆటకు లక్షల్లో అభిమానులున్నారు. ఇవన్నీ ఊరికే చెప్పడంలేదు. ఖతార్ దేశమే చెప్తోంది. అవును ఇప్పటివరకు ఫిఫా మ్యాచులను చూడడానికి స్టేడియానికి వచ్చిన వారిలో భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు. ఫిఫా విడుదల చేసిన డేటా ప్రకారం 48 మ్యాచులు జరిగిన గ్రూపు దశలో ఆటను చూడ్డానికి 56, 893 మంది భారతీయులు మైదానాలకు వచ్చారట. ఇది రెండో స్థానం. సౌదీ అరేబియా 77, 106 మందితో మొదటి స్థానంలో ఉంది. యూఎస్ ఏ (36,236), యూకే (30, 719) మెక్సికో (25, 533), లు మొదటి 5 స్థానాల్లో నిలిచాయి.
ఖతార్ నివేదిక ప్రకారం మొత్తం గ్రూప్ దశ మ్యాచులను 2.45 మిలియన్ల మంది స్టేడియాలకు వచ్చి వీక్షించారు. అంటే 96 శాతం ఆక్యుపెన్సీ ఉంది. ఇది 2018లో రష్యాలో జరిగిన ఫిఫా ఎడిషన్ కంటే ఎక్కువ. అలాగే లుసైల్ మైదానంలో అర్జెంటీనా- మెక్సికో మ్యాచ్ చూడ్డానికి మైదానానికి 88, 966 మంది హాజరయ్యారు. 1994 ఫైనల్ తర్వాత ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో ఇదే అత్యధిక హాజరు.
ఇది మాకు మరపురాని ప్రపంచకప్
'ఇది చిరస్మరణీయమైన ప్రపంచకప్. మైదానం లోపల, వెలుపల అద్భుతమైన గణాంకాలు నమోదయ్యాయి. అభిమానులు స్టేడియాల్లో అందమైన సమయాలను గడుపుతున్నారు. ప్రపంచం మొత్తం టీవీల్లో ఆటను చూస్తూ ఎంజాయ్ చేస్తోంది.' అని ఫిఫా ప్రపంచకప్ సీఓఓ కోలిన్ స్మిత్ అన్నారు. 'కొందరు సవాలుగా భావించిన దాన్ని మేం అవకాశంగా చూశాం. జట్లు, మీడియా, ప్రేక్షకులు ఫుట్ బాల్ ను ఆనందిస్తున్నారు. అత్యాధునికి మౌలిక సదుపాయాలు, సంపూర్ణ కార్యాచరణ, ప్రణాళికల ద్వారా మేం సందర్శకులను ఆకట్టుకుంటున్నాం అని తెలిపారు. ఇది వారికి మరపురాని ప్రపంచకప్ గా మిగిలిపోతుందని' స్మిత్ అన్నారు.