Ronaldo Manchester United Exit: మాంచెస్టర్ యునైటెడ్‌తో క్రిస్టియానో రొనాల్డొ బంధానికి తెరపడింది! పరస్పర అంగీకారంతోనే అతడిని బయటకు పంపిస్తున్నామని క్లబ్ యాజమాన్యం తెలిపింది. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని వెల్లడించింది. క్లబ్ మేనేజర్ ఎరిక్ టెన్ హాగ్‌ను ఓ మీడియా సమావేశంలో విమర్శించడంతో మ్యాన్ యునైటెడ్, రొనాల్డొ మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. మెల్లగా మొదలైన ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారింది.
క్రిస్టియానో రొనాల్డొ ప్రవర్తన తమకు ఇబ్బంది కలిగిస్తోందని మాంచెస్టర్ యునైటెడ్ భావిస్తోంది. దిగ్గజ ఆటగాడే అయినప్పటికీ మేనేజర్ ఎరిక్ టెన్ హాగ్‌కు అండగా నిలవాలని నిర్ణయించుకుంది. టెన్ హాగ్ ఆదేశాలను తాను పట్టించుకోలేదని చెప్పడాన్ని జీర్ణించుకోవడం లేదు. అందుకే అతడితో బంధం తెంచుకోవాలని అనుకుంది. ఫలితంగా రొనాల్డొ నాలుగేళ్లలోనే నాలుగో క్లబ్‌ను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
'పరస్పర అంగీకారంతోనే మాంచెస్టర్ యునైటెడ్‌ను క్రిస్టియానో రొనాల్డొ వీడనున్నాడు. వెంటనే ఇది అమల్లోకి వస్తుంది. ఓల్డ్ ట్రాఫోర్డులో రెండు సీజన్లలో అతడి సేవలకు క్లబ్ కృతజ్ఞతలు తెలియజేస్తోంది. 346 మ్యాచుల్లో 145 గోల్స్ సాధించిన అతడికి, కుటుంబ సభ్యులకు మంచి జరగాలని కోరుకుంటోంది. మాంచెస్టర్ యునైటెడ్‌లో మిగిలిన వారు ఎరిక్ టెన్ హాగ్ నేతృత్వంలో క్లబ్ అభివృద్ధిపై దృష్టి సారించాలి. పిచ్‌లో విజయాలు అందించాలి' అని మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ మీడియాకు తెలిపింది. క్లబ్ తరఫున రెండో స్పెల్‌లో రొనాల్డొ 27 గోల్స్ చేయడం ప్రత్యేకం.
అంతకు ముందు రొనాల్డొపై మాంచెస్టర్ యునైటెడ్ దిగ్గజం వేన్ రూనీ విమర్శలు వర్షం కురిపించాడు. అతడు తల దించుకొని పని చేస్తే మంచిదన్నాడు. జట్టులో అతడి ప్రవర్తన ప్రశ్నార్థకంగా కనిపిస్తోందని వెల్లడించాడు. మేనేజర్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఆడితే మంచిదన్నాడు. ప్రీమియర్ లీగ్ తాజా సీజన్లో మాంచెస్టర్ యునైటెడ్ ప్రదర్శన బాగా లేదు. ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతుండటంతో ఇలా అన్నాడు.
'క్రిస్టియానో తల వంచుకొని పనిచేయాలి. మేనేజర్‌కు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆడేందుకు సిద్ధంగా ఉండాలి. అతడలా ఉంటేనే జట్టుకు ఆస్తిగా మారతాడు. అలా లేకుంటే అనవసర అంతరాయాలకు కారణమవుతాడు' అని రూనీ అన్నాడు. మాంచెస్టర్ యునైటెడ్‌లో అతడి ప్రవర్తన అంగీకారయోగ్యంగా లేదన్నాడు. అతడికి కెప్టెన్ రాయ్ కీన్ అండగా నిలవడాన్ని తప్పు పట్టాడు.
'అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో రొనాల్డో, మెస్సీ ఆల్‌టైమ్ గ్రేట్ ఆటగాళ్లు. అలాంటప్పుడు మీరు నిర్ణయించిన దారిలో నడవొచ్చు. అయితే సీజన్ ఆరంభం నుంచి జరుగుతున్న పరిణామాలు మాంచెస్టర్‌కు ఆమోదయోగ్యం కాదు' అని రూనీ పేర్కొన్నాడు. 'రొనాల్డొకు రాయ్‌కీన్ మద్దతుగా నిలవడం గమనించాను. రాయ్ దానిని అంగీకరించొద్దు. జట్టును పునర్ నిర్మిస్తున్న సమయంలో అతడిలా చేయడం సరికాదు' అని వెల్లడించాడు.