భారత హాకీ ప్లేయర్లు హర్మన్ ప్రీత్ సింగ్, గుర్జిత్ కౌర్ అరుదైన ఘనత సాధించారు. ఎఫ్ఐహెచ్ వీరిద్దరినీ 'ప్లేయర్ ఆఫ్ ది ఇయర్' కు నామినేట్ చేసింది. హర్మన్ ప్రీత్ సింగ్ ఇటీవల జరిగిన టోక్యో ఒలిపింక్స్ లో సత్తా చాటాడు. మొత్తం 8 మ్యాచ్ ల్లో 6 గోల్స్ సాధించి పురుషుల హాకీ జట్టు.. కాంస్య పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
దీంతో 41 ఏళ్ల తర్వాత మన హాకీ జట్టు ఒలింపిక్స్ లో పతకం సాధించింది. టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత పురుషుల హాకీ జట్టులో అత్యధిక ప్లేయర్లు పంజాబ్ నుంచే ఉన్నారు. పంజాబ్ నుంచి 10 మంది హాకీ ప్లేయర్లు టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లారు. దీంతో రాష్ట్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు వారి పేర్లు పెట్టాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
అమృత్‌సర్‌లోని తిమ్మోవల్ పాఠశాల పేరును ఒలింపియన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పేరుతో మార్చనున్నారు. హర్మన్ ప్రీత్ భారత హాకీ జట్టు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
గుర్జిత్ గోల్డెన్ గోల్..
ఈ అవార్డుకు నామినేట్ అయిన మరో ప్లేయర్ గుర్జిత్ కౌర్. భారత మహిళల హాకీ జట్టులో గుర్జిత్ కౌర్ మంచి ప్లేయర్ గా గుర్తింపు పొందింది. ఇటీవల జరిగిన టోక్యో ఒలింపిక్స్ లో ఆమె అద్భుత ప్రదర్శన చేసింది. పతకం సాధించకపోయినా యావత్ భారతీయుల మనసులను గెలుచుకుంది.
గ్రేట్ బ్రిటన్ చేతిలో ఓడి కాంస్య పతకాన్ని చేజార్చుకున్నా భారత మహిళల అద్భుత ప్రదర్శన అందరి ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా కాంస్య పతక పోరులో రెండు గోల్స్‌తో సత్తాచాటిన గుర్జిత్ కౌర్‌ను దేశమంతా అభినందించింది. ఈ నేపథ్యంలో గుర్జిత్ సొంత గ్రామమైన పంజాబ్ అమృత్‌సర్‌లోని మియాది కలాన్‌లో ఆమె పేరిటే ఓ స్టేడియం ఏర్పాటు కానుంది. భారత్-పాకిస్థాన్ సరిహద్దుకు ఈ గ్రామం కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అమృత్సర్ జిల్లాపరిషద్ చైర్మన్ దిల్‌రాజ్ సింగ్.. గుర్జిత్‌సింగ్ పేరిట మియాది కలాన్‌లో నిర్మించనున్న స్టేడియానికి శంకుస్థాన చేశారు. స్టేడియాన్ని వేగంగా పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.
ఇంకెందుకు ఆలస్యం... మన టోక్యో ఒలింపిక్ విజేతలకు ఓటు వేసి మీ అభిమానాన్ని చాటండి.
Also Read: India vs England 2021: మూడో టెస్టు ముందు ఇంగ్లాండ్‌కు భారీ షాక్... గాయంతో మార్క్‌వుడ్ ఔట్