‘‘నాని సినిమాల్లో మాత్రమే హీరో. నిజ జీవితంలో పిరికోడు’’ అంటూ వ్యాఖ్యలు చేసిన సినిమా థియేటర్స్ అసోసియేషన్ ప్రతినిధులపై తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్(APFTG) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా వ్యక్తిగత విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికింది. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి ఉంటేనే సినిమా పరిశ్రమ మనుగడ సాధ్యమని, కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని తెలిపింది. 


‘టక్ జగదీష్’ సినిమాను ఓటీటీలో విడుదల చేయడంపై నిరసన వ్యక్తం చేస్తూ ఇటీవల ఎగ్జిబిటర్లంతా సమావేమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వినాయక చవితి (సెప్టెంబరు 10) రోజున థియేటర్లలో విడుదలవుతున్న నాగ చైతన్య, సాయి పల్లవి చిత్రం ‘లవ్ స్టోరీ’కి పోటీగా.. ఓటీటీలో నానీ నటించిన ‘టక్ జగదీష్’ సినిమాను విడుదల చేస్తున్నారని, ఈ మేరకు ‘టక్ జగదీష్’ సినిమా విడుదలను వాయిదా వేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కొంతమంది ప్రతినిధులు హీరో నానిపై వ్యక్తిగత విమర్శలకు దిగారు. తమకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునేవారిపై లైఫ్‌టైమ్ బ్యాన్ విధిస్తామని కూడా వ్యాఖ్యానించారు. 


ఈ వ్యాఖ్యలపై ‘టక్ జగదీష్’ నిర్మాతలు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్‌ను ఆశ్రయించినట్లు తెలిసింది. దిల్ రాజు, ఠాగూర్ మధు తదితర ప్రముఖ నిర్మాతలు ఈ గిల్డ్‌లో సభ్యులు. సినిమాపై పూర్తి అధికారం, హక్కులు కేవలం నిర్మాతలకే ఉంటుందని.. ఆ సినిమా ఎప్పుడు, ఎక్కడ విడుదల చేయాలనేది నిర్మాతల ఇష్టమేనని గిల్డ్ పేర్కొంది. ఎగ్జిబిటర్లు కేవలం డిమాండ్ ఉన్న చిత్రాలు, పెద్ద సినిమాలపైనే దృష్టి పెడుతున్నారని, చిన్న సినిమాలను పట్టించుకోవడం లేదని పేర్కొంది. కలిసి కట్టుగా పనిచేస్తేనే తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేసింది. లేకపోతే సమస్యలు తప్పవంటూ ఓ లేఖను విడుదల చేసింది. 


‘టక్ జగదీష్’ వివాదంపై చిత్ర నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్ కూడా స్పందించింది. ‘‘తెలుగు ప్రేక్షకులకు మంచి వినోదాత్మక చిత్రాలను అందించాలనే ఉద్దేశంతోనే మా నిర్మాణ సంస్థ ఆవిర్భవించింది. ‘మజిలీ’ సినిమా విజయవంతం తర్వాత నేచురల్ స్టార్ నానితో ‘టక్ జగదీష్’ సినిమా నిర్మించాం. సుమారు రెండున్నరేళ్లు శ్రమించి ఈ సినిమాను తెరకెక్కించాం. గతేడాది డిసెంబర్‌లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నాం. కానీ కోవిడ్-19 వల్ల సాధ్యం కాలేదు. ఈ డిజిటల్ యుగంలో ఏదైనా కంటెంట్‌ను ఆలస్యం చేయడం అంత సేఫ్ కాదు. ఆ సమయంలో మాకు వేరే దారి లేకపోవడంతో హీరో నానితో మాట్లాడి థియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదల కోసం ఒప్పించాం. కానీ, ఆయన థియేటర్ విడుదలకే మొగ్గు చూపారు. తర్వాత మా సమస్యను అర్థం చేసుకుని తన అంగీకారం తెలిపారు. మా సమస్యను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నాం’’ అని ట్విట్టర్‌ ద్వారా ఓ లేఖను విడుదల చేశారు.