టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అండగా నిలిచాడు. ఛాంపియన్‌ ఆటగాళ్లు సైతం మనుషులేనని పేర్కొన్నాడు. ఈ ఏడాది అతడు తప్పక రాణిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. బాగా ఆడుతున్న ఆటగాళ్లకు విఫలమయ్యేందుకు హక్కుందని స్పష్టం చేశాడు. బ్యాక్‌ స్టేజ్‌ విత్‌ బోరియా షోలో అతడు మాట్లాడాడు.


'రెండేళ్లుగా విరాట్‌ కోహ్లీ ఫామ్‌ గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మనం కరోనా మహమ్మారి కాలంలో బతుకుతున్నాం. అతడికీ మధ్యే ఓ పాప పుట్టింది. అతడెంత బాగా ఆడాడో మనందరికీ తెలుసు. మనుషులకు విఫలమయ్యేందుకు అనుమతి ఉంది. చేసే పనిలో అద్భుతాలు సృష్టించిన వారికి ఫెయిలయ్యే హక్కుంది' అని వార్నర్‌ కుండబద్దలు కొట్టాడు.


'నాలుగో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయని ప్రతిసారీ స్టీవ్‌స్మిత్‌ గురించి మాట్లాడుకుంటారు. ఎందుకంటే అతడు ప్రతి నాలుగో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేస్తాడు. అతడో మానవ మాత్రుడు. ప్రతి ఒక్కరి కెరీర్లో గడ్డుకాలం కచ్చితంగా ఉంటుంది. ఇలాంటి అంచనాల వల్లే కోహ్లీ, స్మిత్‌ లాంటి క్రికెటర్లపై ఒత్తిడి పెరుగుతోంది. కానీ వారు ఒత్తిడిని ఫీలవ్వరు. అందుకు నాదీ గ్యారంటీ' అని మంజుందార్‌తో వార్నర్‌ అన్నాడు.






విరాట్‌ కోహ్లీ రెండేళ్లుగా సెంచరీ చేయలేదు. అతడి బ్యాటు నుంచి మరో శతకం చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. విరాట్‌ భారీ స్కోరు చేసేందుకు ప్రయత్నించినా ఔటైపోతున్నాడు. అయితే అతడు చేసే పరుగులు సమయోచితంగానే  ఉండటం గమనార్హం. దక్షిణాఫ్రికా పర్యటనలోనూ అతడు అంచనాల మేరకు రాణించలేదు. ఆఖరి టెస్టులోనైనా అదరగొట్టాలని అందరూ కోరుకుంటున్నారు. 


డేవిడ్‌ వార్నర్‌ను గత ఐపీఎల్‌ సీజన్లో కెప్టెన్సీ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. చివరికి జట్టులోనూ చోటివ్వలేదు. అతడికి వయసు మీద పడిందని, పరుగులు చేయడం లేదని తీసేసినట్టు వార్తలు వచ్చాయి. కానీ అతడు టీ20 ప్రపంచకప్‌లో అద్భుతంగా ఆడాడు. యాషెస్‌ సిరీసులోనూ దంచికొడుతున్నాడు.


Also Read: IND vs SA, 2nd Test: టీమ్‌ఇండియా బౌలర్లు నా ఒంట్లో ఎముకలైనా విరగొట్టాలి! కానీ నేను ఔటవ్వను డాడీ!!


Also Read: Sachin Tendulkar: అభిమానులకు షాకిచ్చిన సచిన్‌..! కఠిన నిర్ణయం తీసుకున్న మాస్టర్‌ బ్లాస్టర్‌


Also Read: IND vs SA: మరే భారత ఆటగాడు బద్దలు చేయని సచిన్‌ 2 రికార్డులివి!