Sachin Tendulkar: సచిన్‌ తెందూల్కర్‌ అభిమానులకు నిరాశే! ఈ ఏడాది జరిగే లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌కు ఆయన అందుబాటులో ఉండటం లేదు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆయన లీగ్‌కు దూరం అవుతున్నారు. మ్యాచులు ఆడటం లేదని తెలిసింది.


మూడేళ్ల క్రితం నుంచి లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ జరుగుతున్న సంగతి తెలిసింది. ఒకప్పటి క్రికెట్‌ తారలు అంతా కలిసి ఈ లీగ్‌ ఆడుతున్నారు. శ్రీలంక, బంగ్లాదేశ్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ లెజెండ్స్‌ జట్లు ఈ లీగ్‌లో పాల్గొంటున్నాయి. ఈ క్రికెట్‌ టోర్నీ ద్వారా ఒకప్పటి స్టార్‌ ఆటగాళ్లను మళ్లీ మైదానంలో చూసే అవకాశం లభించింది.




బీసీసీఐ అధ్యక్షుడు కాకముందు గంగూలీ సైతం ఈ లీగ్‌ ఆడాడు. సచిన్‌ గతేడాది వరకు అలరించాడు. ఇక యువరాజ్‌ సింగ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, హర్భజన్‌ సింగ్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, యూసుఫ్‌ పఠాన్‌ వంటి క్రికెటర్లు ఈ సీజన్లో కనిపించే అవకాశం ఉంది. గత సీజన్లో యువీ, సచిన్‌, పఠాన్ల మెరుపుల్ని ఎవరూ మర్చిపోలేరు. అయితే ఈ లీగ్‌ ముగిసిన వెంటనే ఇండియా లెజెండ్స్‌లో చాలా మందికి కరోనా వైరస్‌ సోకింది. మొదట సచిన్‌, ఆ తర్వాత పఠాన్‌ సోదరులు, యువీకి వచ్చింది. ప్రస్తుతమూ కరోనా వేవ్‌ ఉండటంతో సచిన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది.




ఈ మధ్యే లెజెండ్స్‌ లీగుకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ఈ ప్రమోషనల్‌ వీడియో అమితాబ్‌ బచ్చన్‌ చేత ఇండియా టీమ్‌ను వెల్లడించారు. అందులో సచిన్‌ను ఎంపిక చేసినట్టూ ఉంది. ఈ విషయాన్ని ఎస్‌ఆర్‌టీ స్పోర్ట్స్‌ అధికార ప్రతినిధి వ్యతిరేకించారు. సచిన్‌ ఈ ఏడాది లీగ్‌ ఆడటం లేదని స్పష్టం చేశారు. 'లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌లో సచిన్‌ భాగస్వామ్యంపై వార్తల్లో నిజం లేదు. నిర్వాహకులు అమితాబ్‌ బచ్చన్‌, క్రికెట్‌ అభిమానులను ఇలాంటి వార్తల ద్వారా తప్పుదోవ పట్టించొద్దు' అని ఎస్‌ఆర్‌టీ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ తెలిపింది.