వాండరర్స్‌ టెస్టులో టీమ్‌ఇండియా విజయానికి  దక్షిణాఫ్రికా సారథి డీన్‌ ఎల్గర్‌ అడ్డుగా నిలబడ్డాడు! మూడు టెస్టుల సిరీసును 1-1తో సమం చేశాడు. కోహ్లీసేన జైత్రయాత్రకు కాస్త బ్రేక్‌ వేశాడు. కానీ ఈ టెస్టులో సఫారీ జట్టును కాపాడేందుకు అతడు ఒంటికి దెబ్బలు తగిలించుకున్నాడని తెలిసింది. భారత బౌలర్లు విసిరిన బంతులు అతడికి తీవ్రంగా తగిలాయి. ఈ బాడీలైన్‌ గాయాల గురించి ఎల్గర్‌ తండ్రి రిచర్డ్స్‌ మీడియాకు వివరించాడు.


రెండో టెస్టులో దక్షిణాఫ్రికాకు టీమ్‌ఇండియా 240 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. ప్రత్యర్థి జట్టును భారత బౌలర్లు ఆలౌట్‌ చేసే  సామర్థ్యం ఉన్నప్పటికీ డీన్‌ ఎల్గర్‌ 96 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇందుకోసం అతడు వికెట్‌ను కాపాడుకుంటూ దేహానికి బంతులను తగిలించుకున్నాడు. తన శరీరంలో ఎముకలైనా విరగాలి తప్ప వికెట్‌ పోగొట్టుకోనని అతడు తండ్రికి మాటిచ్చాడట.


'నాన్నా! రేపు ఆట ముగిసే వరకు నేను క్రీజులో ఉంటాను. వాళ్లు (భారత బౌలర్లు) నన్ను ఔట్‌ చేయాలంటే నా ఒంట్లోని ఎముకలను విరగొట్టాలి. నాపై బంతులు విసిరి గాయపరచడం ద్వారా నన్ను బయటకు పంపించలేరు' అని డీన్‌ ఎల్గర్‌ మూడో రోజు సాయంత్రం తనతో అన్నాడని రిచర్డ్స్‌ తెలిపాడు. అతడి ఆట చూస్తున్నంత వరకు అతడి తల్లి ఎంతో గాబరా పడిందని పేర్కొన్నాడు.






'ఎల్గర్‌కు బంతులు తగిలినప్పుడు నేనేమైనా బాధపడతానా? అస్సలు పడను. ఎందుకంటే బడిలో అతడెన్నోసార్లు దెబ్బలు తగిలించుకోవడం చూశాను. అలాంటివేమీ అతడిని ఆపలేవు. అప్పట్నుంచే అతడు గుండెనిబ్బరంతో ఉండేవాడు. గాయపడ్డ ప్రతిసారీ మరింత ఆత్మవిశ్వాసంతో ఆడతాడు. నేనూ సాకర్‌ ఆడాను. అందుకే దెబ్బలు నాకు ఇబ్బంది కలించగవు. కానీ నా భార్య మాత్రం ఆట చూస్తున్నంత సేపూ ఆందోళన పడింది' అని రిచర్డ్స్‌ తెలిపాడు.


'పాఠశాల స్థాయిలో డీన్‌ ఎల్గర్ క్రికెట్‌, స్క్వాష్‌ జట్లకు కెప్టెన్‌గా ఉండేవాడు. నాయకత్వ లక్షణాలు అతడిలో ఎప్పట్నుంచో ఉన్నాయి. దక్షిణాఫ్రికా కెప్టెన్సీ తీసుకున్నా అతడి వ్యక్తిత్వాన్ని మార్చుకోవద్దని చెప్పాను. ఎప్పట్లాగే ఉండాలని చెప్పా. జట్టును ముందుండి నడిపించినప్పుడే గౌరవం వస్తుంది. మైదానం లోపలా, బయటా క్రమశిక్షణతోనే అది సాధ్యమవుతుంది. అందరూ తనతో ఎలా ప్రవర్తించాలని కోరుకుంటాడో  మిగతావాళ్లతో అలాగే ఉండాలని  సూచించాను' అని రిచర్డ్స్‌ వివరించాడు.