ప్రపంచంలోని అన్ని దేశాల్లో క్రికెట్‌ ఆడటం ఒక ఎత్తయితే దక్షిణాఫ్రికాలో ఆడటం మరో ఎత్తు! భిన్నమైన వాతావరణం, స్పాంజీ బౌన్స్‌, కఠినమైన పిచ్‌లు, దుర్భేద్యమైన బౌలర్లు ఆ దేశం సొంతం! అందుకే అక్కడ ఆడటమంటే సవాలే.


టీమ్‌ఇండియా ఇప్పటి వరకు చాలాసార్లు దక్షిణాఫ్రికాలో పర్యటించింది. కానీ సచిన్‌ సాధించిన రెండు రికార్డులను మాత్రం ఎవరూ బద్దలు కొట్టలేకపోతున్నారు. అవే సఫారీ గడ్డపై అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డు. ప్రస్తుత సిరీస్‌ మరో టెస్టుతో ముగుస్తుంది. మరి ఈ మ్యాచులోనైనా ఎవరైనా ఆ రికార్డును బద్దలు చేస్తారేమో చూడాలి.






సచిన్‌ తెందూల్కర్‌ 1997లో దక్షిణాఫ్రికాలో అద్భుతం చేశాడు. భారత్‌ తరఫున అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డును సృష్టించాడు. ఏకంగా 169 పరుగులు చేశాడు.  ఆ తర్వాత 2001లోనూ అతడే రెండో అత్యధిక పరుగులు చేశాడు. 155తో నిలిచాడు. 2013లో చెతేశ్వర్‌ పుజారా అతడిని దాదాపుగా సమీపించేశాడు. 153 పరుగులు చేశాడు. మరో మూడు పరుగులు చేసుంటే రెండో స్థానంలో నిలిచేవాడు. 2018లో విరాట్‌ కోహ్లీ సైతం ఇక్కడే ఆగిపోయాడు. 153 పరుగులు చేశాడు.


ప్రస్తుత మూడు టెస్టుల సిరీసులో రెండు మ్యాచులు ముగిశాయి. మొదటి టెస్టును టీమ్‌ఇండియా రెండో మ్యాచును సఫారీ జట్టు గెలిచాయి. దాంతో సిరీస్‌ 1-1తో సమమైంది. తొలి టెస్టులో కేఎల్‌ రాహుల్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. సెంచరీ బాదేశాడు. 260 బంతులాడి 16 బౌండరీలు, ఒక సిక్సర్‌తో 123 పరుగులు చేశాడు. గత పర్యటనలో విరాట్‌ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ సారి ఆ స్థాయి ప్రదర్శన చేయలేదు. మరి ఆఖరి టెస్టులోనైనా సెంచరీతో మురిపిస్తాడేమో చూడాలి.