Covid Cases In India: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తరువాత భారత్‌లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. తాజాగా 24 గంటల్లో లక్షన్నర వరకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. భారతదేశంలో కరోనా వైరస్ మరోసారి ఉగ్రరూపం దాల్చుతోంది. గడిచిన 24 గంటల్లో 1,59,632 కోవిడ్ కేసులు నమోదుకాగా, నిన్న ఒక్కరోజులో 40,863 కరోనా నుంచి కోలుకున్నారు. అదే సమయంలో 327 మందిని కరోనా మహమ్మారి బలిగొంది.
రోజువారీ పాజిటివిటీ రేటు: 10.21%
దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు: 5,90,603
మొత్తం రికవరీల సంఖ్య: 3,44,53,603
కరోనా మరణాలు: 4,83,790
మొత్తం టీకాలు: 151.58 కోట్ల డోసులు
3,500 దాటిన ఒమిక్రాన్ కేసులు..
దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతోన్న క్రమంలో కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాలు వీకెండ్ లాక్ డౌన్ ప్రకటించాయి. తాజాగా తమిళనాడు సహా మరికొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ బాట పట్టాయి. గడిచిన 24 గంటల్లో 552 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా, మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 3,623కు చేరుకున్నాయి. వీరిలో ఇప్పటివరకూ 1,409 మంది కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. అత్యధికంగా మహారాష్ట్రలో 1009 కేసులు నమోదు కాగా, ఢిల్లీ 513, కర్ణాటక 441, రాజస్థాన్ 373, కేరళ 333, గుజరాత్ 204, తమిళనాడు 185, హర్యానా 123, తెలంగాణలో 123, ఉత్తరప్రదేశ్‌లో 113 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఇదివరకే 439 మంది, రాజస్థాన్ 208, తమిళనాడులో 185 మంది, గుజరాత్ 160 మంది కోలుకున్నారని అధికారులు తెలిపారు.
151 కోట్ల డోసుల టీకాలు..
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతోంది. నిన్న ఒక్కరోజులో దాదాపు కోటి మందికి పైగా టీకాలు తీసుకున్నారు. దీంతో భారత్‌లో కొవిడ్ డోసుల పంపిణీ 151 కోట్ల మైలురాయికి చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా వద్ద మరో 16 కోట్ల డోసుల వరకు నిల్వ ఉన్నాయి. అనుమతి లభించడంతో 15 నుంచి 18 ఏళ్ల టీనేజర్లకు కొవిడ్ టీకాలు వేస్తున్నారు.
Also Read: New Variant: ఒమిక్రాన్ - డెల్టా రకాల లక్షణాలతో కొత్త వేరియంట్ ‘డెల్టాక్రాన్’,ఏ దేశంలో బయటపడిందంటే...